పట్టుబడిన ఇత్తడి చోరీ దొంగలు

కోటబొమ్మాళి మండలం

కేసు వివరాలను వెల్లడిస్తున్న ఎస్‌పి మహేశ్వర రెడ్డి

  • రూ.9 లక్షల విలువ గల సొత్తు రికవరీ
  • ఇత్తడి వాటర్‌ ట్యాప్‌ల చోరీ కేసును చేధించిన పోలీసులు
  • ఏడుగురు అరెస్టు
  • ఎస్‌పి కె.వి మహేశ్వర రెడ్డి

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

కోటబొమ్మాళి మండలం పాకివలసలో ఇటీవల చోరీకి గురైన ఇత్తడి వాటర్‌ పైపుల కేసును పోలీసులు చేధించారు. దొంగతనానికి సంబంధించి సుమారు రూ.తొమ్మిది లక్షల సొమ్మును రికవరీ చేయడంతో పాటు చోరీకి పాల్పడిన ఏడుగురిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్‌పి కె.వి మహేశ్వరరెడ్డి గురువారం మీడియాకు వెల్లడించారు. జల్‌ జీవన్‌ మిషన్‌లో భాగంగా నందిగాం, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, పోలాకి మండలాల్లో ఇత్తడి వాటర్‌ ట్యాప్‌లను బిగించేందుకు కాంట్రాక్టు తీసుకున్న ఎన్‌ఎఆర్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ తనకు వచ్చిన విలువైన మెటీరియల్‌ను కోటబొమ్మాళిలోని పాకివలస సర్వీస్‌ రోడ్డులో ఒక షాపు అద్దెకు తీసుకుంది. ప్రాజెక్టు ఇన్‌ఛార్జిగా మావులూరు వెంకురెడ్డి గత నెల ఐదో తేదీన షాపు వద్దకు వెళ్లి చూడగా హవక్సావా బ్లేడుతో షట్టర్‌ తాళం తొలగించినట్లు గుర్తించారు. లోపలకు వెళ్లి చూడగా, తొమ్మిది వేల ఇత్తడి వాటర్‌ ట్యాపులు ఉన్న 25 మూటలు మాయమైనట్లు తెలుసుకున్నారు. దీనిపై వెంకురెడ్డి గత నెల 30న కోటబొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక్కో ట్యాప్‌ విలువ రూ.వంద ఉంటుందని, మొత్తం తొమ్మిది వేల ట్యాప్‌ల ధర 9 లక్షలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసును ఇలా చేధించారుతెలంగాణ రాష్ట్రం హన్మకొండకు చెందిన కంది సంపత్‌, బొందాని రమేష్‌, చింతల మహేష్‌ పల్లపు యాదగిరి అదే ప్రాజెక్టులో కూలీలుగా పనిచేస్తున్నారు. వీరు నందిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, పోలాకి మండలాలలో పనిచేస్తూ, చీపుర్లపాడులో అద్దెకు నివాసం ఉంటున్నారు. వారికి కంపెనీ నుంచి వచ్చే సామాన్ల విలువ, వాటిని ఎక్కడ భద్రపరుస్తారన్న దానిపై అవగాహన ఉంది. వారు పనిచేస్తున్న సమయంలో పాడైన, పనికి రాని లోహపు పైప్‌లు, ట్యాప్‌లు తదితర వస్తువులను ఈ కేసులో ఐదో నిందితుడిగా ఉన్న సత్రాపు సింహాచలం స్క్రాప్‌ షాప్‌లో అమ్ముతుండేవారు. మూడు నెలలుగా కంపెనీ ట్యాప్‌లను అమ్మి అక్రమంగా డబ్బు సంపాదించేందుకు పధకం వేశారు. దొంగతనం చేసిన వస్తువులను రవాణా చేసేందుకు వారితో గతంలో కూలి పనులు చేసిన కేసులో ఐదో నిందితునిగా ఉన్న కోటబొమ్మాళి మండలం వరహాలమ్మపేటకు చెందిన చెన్నంశెట్టి అప్పన్న సహాయం అడగ్గా, అతను అతని గ్రామానికి చెందిన ఆరో నిందితుడు సదునుపల్లి రాముకి చెందిన టాటా ఏస్‌ మెగా లగేజ్‌ వ్యాన్‌లో రవాణా చేయాలని పధకం వేశారు. ఇత్తడి ట్యాప్‌లను అమ్మగా వచ్చిన సొమ్ములో కొంత ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. వీటిని విశాఖపట్నంలో అమ్మి సొమ్ము చేసుకునేందుకు వెళ్తుండగా టెక్కలి రూరల్‌ సిఐ కె.శ్రీనివాసరావుకు సమాచారం రావడంతో కోటబొమ్మాళి మండలం జర్జంగి జాతీయ రహదారి ఫ్లైఓవర్‌ బ్రిడ్జి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా లగేజ్‌ వాహనంతో పట్టుబడ్డారు. పోలీసులకు ఎస్‌పి ప్రశంసఇత్తడి ట్యాప్‌ల కేసులో క్రియాశీలకంగా వ్యవహరించి కేసును తక్కువ కాలంలోనే చేధించడంలో ప్రతిభ కనబరిచిన క్రైమ్‌ అడిషనల్‌ ఎస్‌పి శ్రీనివాసరావు, టెక్కలి రూరల్‌ సిఐ శ్రీనివాసరావు, కోటబొమ్మాళి ఎస్‌ఐ సత్యనారాయణ, పోలీస్‌ సిబ్బంది మాధవరావు, లోకనాథం, ఉమామహేశ్వర్లను ఎస్‌పి ప్రత్యేకంగా అభినందించారు.

➡️