మాట్లాడుతున్న బోస్
- ఐక్య పోరాటాలతోనే మూడో వేతన సవరణ సాధ్యం
- ఎఐబిడిపిఎ జిల్లా మహాసభలో రాష్ట్ర కార్యదర్శి కె.సి బోస్
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
బిఎస్‌ఎన్‌ఎల్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, పెన్షనర్లపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆలిండియా బిఎస్‌ఎన్‌ఎల్-డిఒటి పెన్షనర్ల అసోసియేషన్ (ఎఐబిడిపిఎ) రాష్ట్ర కార్యదర్శి కె.సి బోస్, రాష్ట్ర సహాయ కార్యదర్శి రామారావు విమర్శించారు. కొన్నేళ్లుగా మూడో వేతన సవరణ చేపట్టకుండా అన్యాయం చేస్తోందన్నారు. నగరంలోని యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో ఎఐబిడిపిఎ జిల్లా నాలుగో మహాసభ గురువారం నిర్వహించారు. ముందుగా జాతీయ పతాకాన్ని, యూనియన్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సభలో వారు మాట్లాడుతూ వేతన సవరణ కోసం ఉద్యోగులు, పెన్షనర్లు సమిష్టి ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పెన్షనర్లు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని, వాటిని పరిష్కరించడంలో యాజమాన్యం, ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సుదీర్ఘకాలం పాటు సంస్థ అభ్యున్నతి కోసం పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన పెన్షనర్లపై అనుసరిస్తున్న తీరు సరికాదన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం బిఎస్‌ఎన్‌ఎల్ సంస్థను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ కంపెనీలకు 4జి, 5జి సేవలను విస్తృతానికి, ఇష్టారాజ్యంగా టారిఫ్‌లను పెంచుకునేందుకు అనుమతులు ఇస్తోందని విమర్శించారు. బిఎస్‌ఎన్‌ఎల్ సంస్థ ఎంతో సామర్థ్యం కలిగి ఉన్నా 4జి, 5జి సేవలకు మోకాలడ్డుతోందన్నారు. పెన్షనర్లకు నెలవారీ చెల్లించే మెడికల్ అలవెన్సును రూ.వెయ్యి నుంచి రూ.మూడు వేలకు పెంచాలని, ఉచిత ఫైబర్‌నెట్ సౌకర్యం కల్పించాలని, మెడికల్ ఎంపానల్‌మెంటు సౌకర్యాన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో పునరుద్ధరించాలని, సంచార భవన్‌లో పెన్షనర్ల అదాలత్‌ను ఏర్పాటు చేసి ఆధార్, పాన్, లైవ్ సర్టిఫికేట్ వంటి సమస్యలను పరిష్కరించాలని తీర్మానాలు చేశారు. నూతన కార్యవర్గం ఎన్నికఎఐబిడిపిఎ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా కె.గోపాలరావు, కార్యదర్శిగా వెంకటరావు పాణిగ్రహి, సహాయ కార్యదర్శిగా ఎం.గోవర్థనరావుతో పాటు 17మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఆ సంఘ జిల్లా ఉపాద్యక్షులు రాజేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన మహాసభలో పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి కె.గణపతి, పోస్టల్ పెన్షనర్ల సంఘం నాయకులు చంద్రశేఖర్, రైల్వే ఉద్యోగుల సంఘం నాయకులు కె.సూరయ్య, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, నగర కన్వీనర్ ఆర్.ప్రకాశరావు, బిఎస్‌ఎన్‌ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పి.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.