మాట్లాడుతున్న డాక్టర్ మల్లేశ్వరరావు
- ప్రజారోగ్య పరిరక్షణ వేదిక అధ్యక్షులు డాక్టర్ ఆర్.మల్లేశ్వరరావు
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
ప్రతిష్టాత్మకమైన ‘నీట్’ పరీక్ష నిర్వహణలో తీవ్ర తప్పిదాలతో విద్యార్థి లోకం దేశవ్యాప్తంగా ఆందోళనలో ఉన్నా పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనిప్రజారోగ్య పరిరక్షణ వేదిక జిల్లా అధ్యక్షులు, జెమ్స్ మెడికల్ కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.మల్లేశ్వరరావు విమర్శించారు. స్వాతంత్య్ర సమరయోధుడు గరిమెళ్ల సత్యనారాయణ జయంతిని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల సెమినార్ హాల్‌లో గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యాన ‘పోటీ పరీక్షల్లో అవకతవకలు- ప్రభుత్వ విధానాలు-యువత కర్తవ్యం’ అనే అంశంపై సోమవారం నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. ప్రైవేటీకరణ విధానాల వల్ల వైద్యరంగం ఇప్పటికే అస్తవ్యస్తంగా ఉందన్నారు. నీట్ అనుభవాలు భవిష్యత్ వైద్య వృత్తిపై నీలినీడలు కమ్ముకునేలా ఉన్నాయని తెలిపారు. దీనిపై యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.సూర్యచంద్రరావు మాట్లాడుతూ నిష్కలంక దేశభక్తుడు కవి, గాయకుడు గరిమెళ్ల జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయమన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో గరిమెళ్ల నిర్వహించిన పాత్ర తెలుగు జాతిపై చెరగని ముద్ర వేసిందని కొనియాడారు. సభాధ్యక్షులు, గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం అధ్యక్షులు వి.జి.కె మూర్తి గరిమెళ్ల జీవిత విశేషాలను వివరించారు. సామ్రాజ్యవాద వ్యతిరేకత, ఆర్థిక స్వావలంబన, అభిప్రాయ స్వేచ్ఛ, నీతి నిజాయతీ, త్యాగనిరతి వంటి గరిమెళ్ల వ్యక్తిత్వ లక్షణాలను నేటి యువత ఆలంబనగా స్వీకరించి అన్వయించుకోవాలని ఆకాంక్షించారు. ‘నిరుద్యోగ భారతం- సమస్యకు కారణాలు పరిష్కారాలు’ అంశంపై వ్యాసరచన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా-ఆవశ్యకత అంశంపై వక్తృత్వ పోటీల్లో విజేతలకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. నీట్ పరీక్ష సమస్యపై మహిళా డిగ్రీ కళాశాల పూర్వ అధ్యాపకులు, రచయిత్రి పత్తి సుమతి రాసిన కవితను చదివి వినిపించారు. ముందుగా గరిమెళ్ల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎం.ప్రభాకరరావు ఆహ్వానం పలకగా, పి.సుధాకరరావు వందన సమర్పణ చేశారు.