మాట్లాడుతున్న మహాలక్ష్మి
మధ్యాహ్న భోజన కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు మహాలక్ష్మి
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నిధులు కేటాయించాలని మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు అల్లు మహాలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి బి.ఉత్తర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. నిధులు కేటాయింపులు పెంచాలని కోరుతూ ఈ నెల 18న విజయవాడలో రాష్ట్రస్థాయి ధర్నా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నగరంలోని సిఐటియు కార్యాలయంలో యూనియన్ జిల్లా కమిటీ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వంట కార్మికులకు రూ.3 వేలు వేతనమిస్తూ వెట్టిచాకిరి చేయిస్తున్నారని అన్నారు. ఈ పథకం ప్రారంభించి 23 ఏళ్లు గడుస్తున్నా… ఇంకా తక్కువ వేతనాలకే పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ధరలు ఆకాశాన్ని అంటుతున్నా పిల్లలకు ఇస్తున్న మెనూ ఛార్జీల్లో మార్పులేదన్నారు. మరోవైపు మెనూల మార్పుల పేరుతో కార్మికులపై అదనపు భారాన్ని మోయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా కార్మికులను అక్రమంగా తొలగిస్తున్నారని, రాజకీయ వేధింపులు రోజురోజుకూ అధిక మవుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన నీమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. వంట కార్మికులను తొలగించి ప్రయివేటు సంస్థలకు అప్పగించడం వల్ల భోజనం వృథా అవుతుందన్నారు. ప్రయివేటు ఏజెన్సీలు సరఫరా చేస్తున్న భోజనాలను పిల్లలు సక్రమంగా తినడంలేదన్నారు. వంట సమయంలో ప్రమాదాల బారిన కార్మికులకు ప్రమాద బీమా వర్తింపజేయాలన్నారు. సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు ఎన్.గీతాబాలా, కౌసల్య, తులసమ్మ, లక్ష్మి, తులసి, ప్రవీణ పాల్గొన్నారు.