కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు
ప్రజాశక్తి-శ్రీకాకుళం అర్బన్ : స్వచ్ఛ శ్రీకాకుళం నిర్మాణం అందరి బాధ్యత కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. గాంధీ జయంతిని పురష్కరించుకొని స్వచ్ఛతా హి ముగింపు కార్యక్రమంలో భాగంగా నగరంలోని అరసవల్లి మిల్లు జంక్షన్ నుంచి కలెక్టరేట్ వద్ద ఉన్న డచ్ భవనం వరకు సైకిల్ ర్యాలీని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛతా హి సేవ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 2 వరకు రెండు వారాల పాటు స్వచ్ఛతా హి కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో నిర్వహించుకోవడం అభినందనీయమని తెలిపారు. ప్రధాని మోదీ భారతదేశాన్ని స్వచ్ఛభారత్ కోసం నడుం బిగించిన మహనీయుడని కొనియాడారు. చీపురు పట్టి దేశాన్ని పరిశుభ్రం చేసేందుకు ముందుకు కదిలిన తొలి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అని పేర్కొన్నారు. స్వఛ్ఛ శ్రీకాకుళం నిర్మాణం ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని అన్నారు. రెండు వారాల పాటు నిర్వహిస్తున్న స్వచ్ఛతా హి కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు, పలు కంపెనీలు, డ్వాక్రా మహిళలు, కార్పొరేషన్ సిబ్బంది భాగస్వామ్యం కావడం గొప్ప విషయమన్నారు. రెండు వారాల పాటు పార్కులు, మైదానాలు, పాఠశాలలను శుభ్రం చేసుకోవడం జరిగిందని వివరించారు. భవిష్యత్‌లో ఇదే మాదిరిగా అందరి సహకారంతో స్వచ్ఛ శ్రీకాకుళం నిర్మాణానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇక నుంచి ప్రతీ రెండు వారాలకోసారి నగరంలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి పరిశుభ్రం చేసేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. పరిశుభ్రతలో శ్రీకాకుళం నగరాన్ని దేశంలో టాప్-10 నగరాల్లో ఉంచడమే లక్ష్యంగా ప్రతీ ఒక్కరం పాటుపడాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగర పరిధిలోని అన్ని పార్కులను శుభ్రం చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని చెప్పారు. డచ్ బిల్డింగ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, దీనిని ఒక ఛాలెంజ్‌గా తీసుకుంటున్నామని తెలిపారు. ఈ భవనానికి 400 సంవత్సరాల చరిత్ర ఉందని డచ్ బిల్డింగ్‌కు జిల్లా చరిత్రకు ముడిపడి ఉందని వివరించారు. త్వరలోనే భవనం సమీపంలో ఓ పార్కును ఏర్పాటు చేసి చిన్నారులకు ఆటలు ఆడుకునేందుకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఇక్కడ ఫుడ్ కోర్టు కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రతి ఉదయం నగరంలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్న సఫాయి మిత్రలకు ప్రతీ ఒక్కరూ రుణపడి ఉంటామని చెప్పారు. నగర పరిధిలోని కాలువలు, రోడ్లు, వీధులు శుభ్రం చేసేందుకు వారి ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నారని కొనియాడారు. ప్రజాప్రతినిధులను ఎంత గౌరవిస్తున్నామో సఫాయి మిత్రలను కూడా అంతే గౌరవించాలని చెప్పారు. పరిశుభ్రతను పాటిస్తానని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను కేంద్రమంత్రి తిలకించారు. అనంతరం సఫాయి మిత్రలకు, పలు స్వచ్చంద సంస్థలకు, విద్యార్థులకు సర్టిఫికేట్లు, మెమొంటోలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ స్వచ్ఛతా హి కార్యక్రమంలో భాగంగా నగరంలోని 15 రోజుల పాటు అనేక స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహించుకున్నామని తెలిపారు. అలాగే నాగావళి రివర్‌వ్యూ పార్కు అభివృద్ధికి కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు నిధులు కేటాయించేందుకు అంగీకరించి త్వరలోనే దీనిని అభివృద్ధి చేస్తానని వివరించారు. బాపూజీ కలలు కన్న స్వచ్ఛ భారత్ సాధనకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా డచ్ భవన ఆవరణలో కేంద్ర మంత్రి మొక్కలు నాటారు. సఫాయి మిత్రలకు అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్‌పి కెవి మహేశ్వరరెడ్డి, కమిషనర్ ప్రసాదరావు, డీఎస్పీ వివేకానంద, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ బి సుధీర్, లైన్స్ క్లబ్ శ్రీకాకుళం హర్షవల్లి ప్రతినిధులు హారికా ప్రసాద్, వావిలాపల్లి జగన్నాథనాయుడు, మణిశర్మ తదితరులు పాల్గొన్నారు.