‘స్వచ్ఛ శ్రీకాకుళం’ అందరి బాధ్యత

పారిశుధ్య నిర్వహణలో

సైకిల్‌ యాత్రలో పాల్గొన్న కేంద్ర మంత్రి, కలెక్టర్‌, ఎమ్మెల్యే

  • కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

పారిశుధ్య నిర్వహణలో శ్రీకాకుళం దేశంలోనే టాప్‌ టెన్‌ జాబితాలో చోటు సంపాధించాలని, స్వచ్ఛ శ్రీకాకుళం నిర్మాణం అందరి బాధ్యతగా భావించాలని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని బుధవారం స్వచ్ఛతా హీ సేవ ముగింపు కార్యక్రమంలో భాగంగా డచ్‌ బంగ్లా వద్ద కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి బుధవారం అవార్డుల ను ప్రదానం చేశారు. అంతకుముందు అరసవల్లి మిల్లు కూడలి నుంచి 80 అడుగుల రోడ్డు మీదుగా కలెక్టరేట్‌ వరకు సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 2 వరకు రెండు వారాల పాటు స్వచ్ఛతా హీ సేవాకార్యక్రమాన్ని జిల్లాలో 912 పంచాయతీల్లో చిత్తశుద్ధితో నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రధాని మోదీ పదేళ్ల నుంచి దేశాన్ని స్వచ్ఛ భారత్‌గా చేయాలని భావిస్తున్నారని అన్నారు. స్వచ్ఛ శ్రీకాకుళం కోసం ప్రజల భాగస్వాములు కావాలన్నారు. నగర పరిధిలోని అన్ని పార్కులను శుభ్రం చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాల న్నారు. నగరాన్ని నిరంతరాయంగా పరిశుభ్రంగా ఉంచుతున్న సఫాయి మిత్రలకు రుణపడి ఉంటామని చెప్పారు. నగర పరిధిలోని కాలువలు, రోడ్లు, వీధులు శుభ్రం చేసేందుకు వారి ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టి ఆరోగ్యాన్ని కాపాడుతున్నారని కొనియాడారు. డచ్‌ భవన ఆవరణలో కేంద్ర మంత్రి మొక్కలు నాటారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 912 గ్రామ పంచాయతీల్లో గత 15 రోజులలో స్వచ్ఛతా హీ సేవ, సంపూర్ణ స్వచ్ఛతతో సహా, స్వచ్ఛ లక్షిత్‌ ఏకయీ సఫాయి మిత్ర, సురక్షా శివిర్‌ లాంటి కార్యక్రమాలను నిర్వహించామన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవలో భాగంగా నాగావళి రివర్‌వ్యూ పార్కు అభివృద్ధికి కేంద్ర మంత్రి నిధులు కేటాయించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, ఎస్‌పి కె.వి.మహేశ్వరరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, కార్పొరేషన్‌ కమిషనర్‌ ప్రసాదరావు, డిఎస్‌పి సిహెచ్‌.వివేకానంద, మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ బి.సుధీర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️