10న నులిపురుగుల నిర్మూలన దినోత్సవం
ప్రజాశక్తి- శ్రీకాకుళం
జిల్లాలోని అన్ని అంగన్వాడీ, ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులకు నులిపురుగుల నిర్మూలన మాత్రలు ఈ నెల 10న పక్కాగా వేయించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంపై జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం నిర్వహించారు. ఈ మాత్రలు తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని వివరించాలన్నారు. కార్యక్రమంలో ఎంపిడిఒలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, స్వచ్ఛంద సేవా సంఘాలు భాగస్వాములు కావాలన్నారు. ఈ నెల 10న డీ-వార్మింగ్ డే, 17న మాప్ అప్ డే కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, దీనిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 17న మాప్ అప్ కార్యక్రమంలో వివిధ కారణాల రీత్యా మాత్రలు వేసుకోని వారిని గుర్తించి ఆ రోజు మాత్రలు వేయించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో 1 నుంచి రెండేళ్ల వరకు పిల్లలకు సగం మాత్ర, 3 నుంచి 19 ఏళ్ల వరకు గల విద్యార్థులతో పాటు పాఠశాలలకు వెళ్లని పిల్లలకు అంగన్వాడీ కార్యకర్తలు ద్వారా మాత్రలు వేయించాలన్నారు. ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భోజనం తర్వాత ప్రతి విద్యార్థికీ ఒక మాత్రను వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తల సమన్వయంతో నమిలి తినిపించాలని పేర్కొన్నారు. చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని పాఠశాలలకు, కళాశాలలకు మాత్రలు పంపిణీ చేసేందుకు ఆయా పిహెచ్‌సిల్లో సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాలమురళి మాట్లాడుతూ చిన్నారులు, విద్యార్థులందరికీ అల్బెండజోల్ మాత్రల పంపిణీ చేస్తామన్నారు. జిల్లాలో 4,46,982 మందికి మాత్రల పంపిణీ చేయాల్సి ఉండగా, ఐదు లక్షలకు పైగా మాత్రలు సిద్ధంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ పీడి బి.శాంతిశ్రీ, డిఇఒ తిరుమల చైతన్య, డిపిఎంఒ బి.రవీంద్ర, డెమో వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.