మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
- ఘనంగా ప్రారంభమైన సిపిఎం 18వ జిల్లా మహాసభలు
- జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన పార్టీ శ్రేణులు
- నృత్యాలు, వాయిద్యాలతో సాగిన ప్రదర్శన
- పోరాటాల సమీక్ష… కర్తవ్య దీక్ష
- ధరల తగ్గింపుపై బిజెపివి మాయమాటలు
- సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
- ఐటిడిఎ ఏర్పాటుకు ప్రభుత్వంపై ఒత్తిడి
- సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్
ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి, పలాస, వజ్రపుకొత్తూరు
ఉద్యమాల గడ్డ ఉద్దానంలో సిపిఎం 18వ జిల్లా మహాసభలు ఉత్సాహంగా, చైతన్య స్ఫూర్తితో ప్రారంభమయ్యాయి. మహాసభల సందర్భంగా పలాస ఆర్‌టిసి కాంప్లెక్స్ నుంచి కాశీబుగ్గ సంతమైదానం వరకు నిర్వహించిన ప్రదర్శన, బహిరంగ సభకు జిల్లా నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివచ్చాయి. ఎర్రజెండాలు చేతపట్టుకుని ప్రదర్శనగా బయలుదేరారు. కదం తొక్కుతూ, పదం పాడుతూ ముందుకు సాగారు. డప్పు వాయ్యిదాలు, తప్పెటగుళ్లు, కోలాటాలు, నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా కదిలారు. పార్టీ ప్రతినిధులతో మహాసభ ప్రాంతమైన కీ.శే సీతారాం ఏచూరి నగర్ (కాశీబుగ్గ రైల్వేకాలనీ) కళకళలాడింది. అరుణ పతాకాల రెపరెపలతో ఆ ప్రాంతంతో పాటు పలాస ఎరుపెక్కింది.ప్రజల ఆదాయాలు పెంచుతాం, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ఎన్నికల ముందు ప్రధాని మోడీ మాయ మాటలు చెప్పారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. కాశీబుగ్గ సంతమైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం సొంత విధానాలు అమలు చేయకుండా అంతా మోడీ చెప్పినట్లు చేస్తోందని చెప్పారు. జగన్ మాదిరిగానే చంద్రబాబు దెబ్బతింటారని హెచ్చరించారు. విశాఖ ఉక్కుపై ఒక్కో పార్టీ ఒక్కో తీరున మాట్లాడుతోందన్నారు. విశాఖ స్టీల్‌ను రక్షించుకోవడంతో పాటు 30 వేల మంది ఉద్యోగాలను కాపాడుతోంది సిపిఎం అని అన్నారు. వికసిత్ భారత్ అని మోడీ చెప్తుంటే, వికసిత్ 2047 అని చంద్రబాబు అంటున్నారని… కనీసం ఉత్తరాంధ్ర విజన్ అయినా ఉందా అని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్‌లో శ్రీకాకుళం జిల్లాకు వెనుకబడిన ప్యాకేజీ కింద ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారని, ఒక్క పైసా అయినా విడుదల చేశారా అని ప్రశ్నించారు. ప్రజల ఆదాయం, ఆస్తులు పెంచే విజన్ కావాలన్నారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఉండాలన్నారు. ప్రజల ఆదాయాలు పెరిగితే కొనుగోలు శక్తి పెరుగుతుందని చెప్పారు. తద్వారా మరిన్ని పరిశ్రమలు ఏర్పాటై యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయని.. ఈ రకమైన విజన్ ఉండాలన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినందున కేంద్రం నుంచి చంద్రబాబే డబ్బులు తీసుకురావాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు, సమస్యలపై ప్రజలు చర్చించకండా మతాలు, కులాలు, ఉప కులాల పేరుతో ప్రజల మధ్య చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు తిరుపతి లడ్డూ నుంచి మొదలుపెట్టి సనాతన ధర్మం వరకు మాట్లాడుతున్నారని చెప్పారు. మహిళల అణచివేత, సతీసహగమనం వంటివీ కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు. తమ దృష్టిలో సనాతన ధర్మమంటే సమతా ధర్మం, సమాన ధర్మమని చెప్పారు. రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయని… మాఫియా, గుండాలు, అనినీతిపరులు రాజకీయాల్లో చేరి ప్రజల ఆస్తులను కొల్లగొడుతున్నారని తెలిపారు. రాజకీయాల్లో మహిళల పాత్ర పెరగాల్సిన అవసరముందన్నారు. మహిళలు ముందుండి పోరాడితే గానీ సమాజంలో మార్పు సాధ్యం కాదన్నారు.
కార్పొరేట్లకు ఉప్పు భూములు కట్టబెట్టే కుట్ర
జిల్లాల పునర్విభజన తర్వాత జిల్లాలో ఐటిడిఎ లేకపోవడంతో గిరిజనుల సంక్షేమం, ఏజెన్సీ అభివృద్ధి లేకుండా పోయిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్ అన్నారు. టిడిపి కూటమి ప్రభుత్వం వెంటనే ఐటిడిఎ ఏర్పాటు చేసేలా మహాసభలో కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. జిల్లాలోని ఉప్పు భూములను కూటమి ప్రభుత్వం కార్పొరేట్లకు అప్పగించాలని చూస్తోందని విమర్శించారు. ఎన్టీఆర్ వారసులమని చెప్తున్న టిడిపి నాయకులు, ఆయన పునాది వేసిన భావనపాడు ఫిషింగ్ హార్బర్‌ను ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. పోర్టు పేరుతో వేలాది ఎకరాల ఉప్పు భూములను కట్టబెట్టేందుకు ప్రభుత్వం డ్రోన్ సర్వే కూడా చేసిందని చెప్పారు. సముద్రతీరంలో ఒక్క ఎకరా భూమిని ఇచ్చినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. వీరగున్నమ్మ వారసత్వం, శ్రామిక, ఇతర అన్ని తరగతుల మహిళలు పోరాటాల్లో భాగస్వామ్యం కావాలన్నారు. ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న సిపిఎంకు అండగా నిలవాలని కోరారు.వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో పరిశ్రమలను ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తామని, వలసలు నివారిస్తామంటూ పాలకులు మాటలే చెప్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు విమర్శించారు. నేరడి బ్యారేజీని పూర్తి చేస్తే రెండో పంటకూ వంశధార నీరు ఇవ్వవచ్చని చెప్పారు. జిల్లాలో ఒక్క సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రీ లేదన్నారు. మహాసభలో జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. సభాధ్యక్షులు, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.మోహనరావు మాట్లాడుతూ ఉద్దాన ప్రాంతం ఉద్యమాలకు కేంద్రంగా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలకు వేదిక కానుందన్నారు. వంశధార, బాహుదా నదులు అనుసంధానం చేస్తామని ఆరేళ్లుగా చెప్తున్నారు తప్ప నేటికీ నిధులు కేటాయించలేదని విమర్శించారు. పలాసకు సాగు, తాగునీరు అందించే ఆఫ్‌షోర్ ప్రాజెక్టును 15 ఏళ్లు కావస్తున్నా పూర్తి చేయలేదన్నారు.
ఆకట్టుకున్న కళారూపాలు
మహాసభల సందర్భంగా పలువురు కళాకారులు పలుకళారూపాలను ప్రదర్శించారు. మెళియాపుట్టి మండలం చీపురుపల్లికి చెందిన శంకరరావు బృందం తప్పెటగుళ్లు ప్రదర్శించగా, మహిళలు ఎర్ర చీరలు ధరించి కోలాటమాటాడారు. ఆర్‌టిసి కాంప్లెక్స్, సభా వేదిక వద్ద ఎర్రజెండా, ఎర్ర జెండా ఎన్నియల్లో పాటకు వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లి చెందిన చిన్నారులు నృత్యం చేశారు. ప్రజా నాట్యమండలి కళాకారులు కె.హేమసూదన్ బృందం పలు విప్లవ గీతాలను ఆలపించారు
.ప్రజాశక్తి బుక్స్ స్టాల్ ఏర్పాటు
పార్టీ సాహిత్యం, ఉద్యమాల చరిత్రకు సంబంధించిన పుస్తకాలను ప్రజాశక్తి బుకహేౌస్ ఏర్పాటు చేసింది. పలువురు సందర్శకులు స్టాల్‌ను సందర్శించి పుస్తకాలు కొనుగోలు చేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి, జి.సింహాచలం, జిల్లా కమిటీ సభ్యులు కె.నాగమణి, పి.తేజేశ్వరరావు, పోలాకి ప్రసాదరావు, ఎన్.షణ్ముఖరావు, ఎస్.ప్రసాదరావు, ఎన్.గణపతి తదితరులు పాల్గొన్నారు.