మాట్లాడుతున్న సన్యాసినాయుడు
ప్రజాశక్తి – శ్రీకాకుళం లీగల్
ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించే చట్టం మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు తెలిపారు. జిల్లా కోర్టులోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం-2013పై అవగాహనా సదస్సును మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలో ఆర్టికల్స్ 14, 15 ప్రకారం లైంగిక వేధింపు అనేది స్త్రీ ప్రాథమిక సమాన హక్కులను ఉల్లంఘిస్తుందన్నారు. లైంగిక వేధింపులను నివారించడమే చట్టం ముఖ్య లక్ష్యమన్నారు. ఐసిడిఎస్ పీడీ బి.శాంతిశ్రీ మాట్లాడుతూ ప్రతి కార్యాలయంలో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. 2013లో ప్రవేశపెట్టిన పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల చట్టం (నివారణ, నిషేధం, దిద్దుబాటు)ను పటిష్టంగా అమలు చేయాల్సిన బాధ్యత ఆయా శాఖల ఉన్నతాధికారులపై ఉందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు అన్న తేడా లేకుండా కనీసం పది మంది ఉద్యోగులున్న ప్రతి కార్యాలయంలో కమిటీని ఏర్పాటు చేసి, అందుకు సంబంధించిన వివరాలు ఐసిడిఎస్ కార్యాలయానికి పంపాలన్నారు. సచివాలయాల్లోనూ ఈ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాస్థాయిలో ఒక కమిటీ (ఎల్‌సిసి) పనిచేస్తుందని, పది మంది కంటే తక్కువ మంది పనిచేసే సంస్థలు, కార్యాలయాల ఉద్యోగులు ఈ కమిటీని సంప్రదించవచ్చని తెలిపారు. సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.సుదర్శన దొర, డిసిఎల్ అజరు కార్తికేయ, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ బి.రాంబాబు, ఆర్‌టిఒ మంగాదేవి తదితరులు పాల్గొన్నారు.