- ప్రభుత్వ కార్యక్రమాల్లో టిడిపి శ్రేణులదే హవా
- నీటిసంఘాల ఎన్నికల్లోనూ వారికే
- పదవులుతమకు అవకాశం కల్పించడం లేదని భాగస్వామ్య పక్షాల మథనం
- నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయం
కూటమి పార్టీలోని భాగస్వామ్య పక్షాలైన టిడిపి, జనసేన, బిజెపి మధ్య క్రమేణా అంతరాలు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికల ముందు నాటి ఉత్సాహం ఇప్పుడు కనిపించడం లేదు. ఎన్నికల సందర్భంలో గెలుపు కోసం సమన్వయ కమిటీ సమావేశాలను ఏర్పాటు చేసి చొరవ చూపింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటువంటి సమన్వయ సమావేశాలేవీ నిర్వహించకపోవడంతో జనసేన, బిజెపి నాయకులు, శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎన్నికల ప్రచార సమయంలో టిడిపి నేతలు మిత్రపక్షాల ఇళ్లకు వెళ్లి కొందరు, ఫోన్లు చేసి మరీ ప్రచారంలో అంతా కలిసి తిరిగారు. ఎనిమిది నెలల తర్వాత పరిస్థితి ఏకంగా మారిపోయిందని ఆయా పార్టీల నాయకులు, శ్రేణులు మథనపడుతున్నాయి.
ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు టిడిపి, జనసేన, బిజెపి కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. సీట్ల సర్దుబాటులో భాగంగా జిల్లాలోని ఎనిమిది స్థానాలకు గానూ ఏడు చోట్ల టిడిపి, ఒక చోట బిజెపి పోటీ చేశాయి. మూడు పార్టీలు ఉమ్మడిగానే ప్రచారం సాగించాయి. జిల్లాల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మూడు పార్టీలకు వచ్చిన సీట్లను బట్టి నామినేటెడ్ పదవులను కేటాయించాలన్న నిర్ణయం మేరకు జిల్లాలో పలువురు జనసేన, బిజెపి నాయకులకు పదవులు దక్కాయి. కానీ జిల్లాకు సంబంధించిన కొన్ని రకాల పదవుల్లో వారికి టిడిపి నేతలు స్థానం దక్కనీయడం లేదన్న ఆవేదన ఇరు పార్టీల్లో నెలకొంది. గతేడాది డిసెంబరులో నిర్వహించిన సాగునీటి సలహా సంఘాల ఎన్నికల్లో జనసేన కోరిన ప్రాంతాల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను ఇవ్వడానికి టిడిపి నాయకులు నిరాకరించడంతో అప్పట్నుంచి జనసేన, బిజెపి నాయకుల్లో అసంతృప్తి మొదలైంది.
మిత్రపక్షాలను విస్మరిస్తున్న టిడిపి
ఎన్నికల ముందు సమన్వయ కమిటీ సమావేశాలకు ఫోన్లు చేసి మరీ పిలిచిన టిడిపి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత తమను పట్టించుకోవడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకూ తమను ఆహ్వానించడం లేదనే అసంతృప్తి వారిలో గూడు కట్టుకుని ఉంది. అరసవల్లి రథసప్తమి వేడుకలను మూడు రోజుల పాటు నిర్వహించినా ఎక్కడా జనసేన, బిజెపి నాయకులను భాగస్వామం చేయలేదనే చర్చ పార్టీ శ్రేణుల్లో సాగుతోంది. సమీక్షా సమావేశాలకూ వారిని పిలవడం లేదన్న ఆవేదన ఆయా పార్టీ నాయకుల్లో నెలకొంది.
ముందే మేలుకున్న జనసేన
రాష్ట్రవ్యాప్తంగా మూడు పార్టీలు కలిసి నిర్ణయించిన మేరకు రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులు దక్కినా, జిల్లాకొచ్చేసరికి ఆ మేరకు వారికి స్థానం లభించడం లేదన్న అభిప్రాయం నెలకొంది. ప్రభుత్వం ఐదు విడతలుగా భర్తీ చేసిన నామినేటెడ్ పదవుల్లో టిడిపితో పాటు జనసేన, బిజెపి నాయకులకు పలు కార్పొరేషన్లకు చైర్మన్, డైరెక్టర్ పదవులను పొందారు. అదే జనవరిలో నిర్వహించిన నీటిసంఘాల్లో జనసేనకు నాలుగైదు చోట్ల చైర్మన్ పదవులు దక్కగా, బిజెపికి అదీ లేదు. ప్రభుత్వం త్వరలో పిఎసిఎస్‌లకు పర్సనల్ ఇన్‌ఛార్జీలను నియమిస్తున్నట్లు ప్రకటించడంతో, జనసేన ముందే మేల్కొంది. మండలంలో నాలుగు పిఎసిఎస్‌లు ఉంటే అందులో రెండు, ఆరు ఉంటే నాలుగు పర్సన్ ఇన్‌ఛార్జి పదవులు ఇవ్వాలని టిడిపి ముందు డిమాండ్‌గా పెట్టినట్టు సమాచారం.
లోకేష్ దృష్టికి జిల్లా వ్యవహారాలు
జిల్లాలో తమకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదన్న అంశంపై తీవ్రంగా మథనపడుతున్న జనసేన, బిజెపి నాయకులు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. జిల్లాకు చెందిన టిడిపి, జనసేన, బిజెపి అధ్యక్షులు గత నెలలో సమావేశమై దీనిపై చర్చించినట్లు తెలిసింది. శ్రీకాకుళం జిల్లాతో పాటు అన్ని జిల్లాలోనూ జరుగుతున్న పరిమాణాలను పార్టీ పరిశీలిస్తోందని, వచ్చే నెలలో పిఠాపురంలో జరిగే ప్లీనం సమావేశాల్లో దీనిపై చర్చ ఉంటుందని జనసేన పార్టీకి చెందిన ఓ ముఖ్య నాయకుడు చెప్పారు. అంతర్గతంగా అసంతృప్తులు ఉన్నా, ఇప్పటివరకు ఎవరూ బహిర్గతం కాలేదు. కూటమి పార్టీ అధినేతలు ఇచ్చిన ఆదేశాలతో వారంతా మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో పిఎసిఎస్, మార్కెట్ కమిటీలు వంటి పదవుల భర్తీలో నీటిసంఘాల తరహాలో టిడిపి ఏకపక్షంగా వెళ్తే జనసేన, బిజెపి నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలు లేకపోలేదని కొందరు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. కూటమి పార్టీలో నెలకొన్న అంతరాలు ఎటువైపునకు దారితీస్తాయోనన్న ఆందోళన మూడు పార్టీల శ్రేణుల్లో నెలకొంది.