గ్రామస్తులతో మాట్లాడుతున్న ఎడిఎ రమణమూర్తి
పొందూరు:
గ్రామంలో లోవోల్టేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని, ఎన్నో ఏళ్లుగా స్ధానిక విద్యుత్ అధికారుల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదంటూ మండలం నందివాడ గ్రామస్తులు శనివారం శ్రీకాకళంలోని విద్యుత్‌శాఖ ఎడి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. లోవోల్టేజీ కారణంగా గ్రామంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు పాడైపోవడంతో రెండు రోజులుగా చీకటిలోనే గడపాల్సి వచ్చిందంటూ గ్రామస్తులు ఆవేదనను వ్యక్తం చేశారు. విద్యుత్ సమస్యతో విసిగిపోయిన గ్రామస్తులు స్ధానిక లైన్‌మేన్ సహాయంతో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లును తొలగించి వాటిని పట్టుకుని శ్రీకాకుళం ఎడిఎ కార్యాలయానికి వెళ్లి ఆందోళన చేశారు. దీంతో ఎడిఎ యు.వి.రమణమూర్తి గ్రామస్తులకు నచ్చచెప్పి 11కెవి, 15 కెవి కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు అందజేశారు. గ్రామస్తులు తమ సొంత ఖర్చులతో వాటిని గ్రామంలోకి తీసుకువచ్చి పాత ట్రాన్స్‌ఫార్మర్లు స్ధానంలో ఏర్పాటు చేశారు. గతంలో ఇదే లోడ్ ట్రాన్స్‌ఫార్మర్లు ఉండడంతో లోవోల్టేజీ సమస్య ఉండేదని, ఇప్పుడు కూడా ఇవే లోడ్ ట్రాన్స్‌ఫార్మర్లు ఇచ్చారంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. లోవోల్టేజీ సమస్య పరిష్కారానికి అధిక లోడ్ ఉండే ట్రాన్స్‌ఫార్మర్లు అధి కారులు ఏర్పాటు చేయాలంటూ గ్రామస్తులు కోరుతున్నారు.