ధర్నా చేస్తున్న బ్యాంకు ఉద్యోగులు
- యుబిఐ రీజనల్ కార్యాలయం వద్ద బ్యాంకు ఉద్యోగుల ధర్నా
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
ప్రభుత్వరంగ బ్యాంకులను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ కన్వీనర్ బి.శ్రీనివాసులు విమర్శించారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపుమేరకు నగరంలోని సింహద్వారం వద్ద గల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ కార్యాలయం వద్ద బ్యాంకు ఉద్యోగులు, అధికారులు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వరంగ బ్యాంకులపై ప్రభుత్వ వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బ్యాంకు అధికారులు, ఉద్యోగులపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తగినన్ని కేడర్లలో వెంటనే రిక్రూట్‌మెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఐదు రోజుల పని దినాలను వెంటనే అమలు చేయాలని కోరారు. ఐ బోక్ రీజనల్ కార్యదర్శి కె.తేజేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగులకు వచ్చే జీతంపై టాక్స్ భరిస్తున్నారని, దీనికి భిన్నంగా ఉద్యోగుల రుణాలపై టాక్స్ వసూలు చేయాలని బ్యాంకింగ్ యాజమాన్యాలు ఆలోచిస్తున్నాయన్నారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధిత రుణాలపై టాక్స్‌లను బ్యాంకులే భరించాలన్నారు. కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు గిరిధర్ నాయక్ మాట్లాడుతూ బ్యాంకుల్లో టెంపరరీగా పనిచేస్తున్న ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకు యాజమాన్యాలు తాత్కాలిక నియామకాలు చేయకూడదని శాశ్వత నియామకాలు చేపట్టి, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ధర్నాలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు జి.కరుణ, ఇండియన్ బ్యాంక్ మహిళా కన్వీనర్ శ్రావణి, కోఆర్డినేషన్ జాయింట్ కార్యదర్శి ఎ.సూర్య, ఒబిసి ఉద్యోగ సంఘ నాయకులు సూర్యకిరణ్, నరేష్ శ్రీనివాస్, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.