సిపిఎస్‌ రద్దు కోసం నిరంతర పోరాటం

సిపిఎస్‌ విధానం రద్దు కోసం నిరంతర పోరాటం

మాట్లాడుతున్న సన్నశెట్టి రాజశేఖర్‌ నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవి, వెంకటేశ్వర్లు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

సిపిఎస్‌ విధానం రద్దు కోసం నిరంతర పోరాటం కొనసాగిస్తున్నట్లు ఎపిటిఎఫ్‌ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు, ఐఫియా జాతీయ కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్‌ తెలిపారు. సిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. నగరంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో ఎపిటిఎప్‌ జిల్లా మహాసభలను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2004 నుంచి సిపిఎస్‌ను రద్దు చేయాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యమిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఒపిఎస్‌ను పునరుద్ధరిస్తున్నా, బిజెపి పాలిత రాష్ట్రాల్లో సిపిఎస్‌ రద్దుపై సానుకూలత లేకపోవడం శోచనీయమన్నారు. సిపిఎస్‌ను రద్దు చేస్తామని గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మాట ఇచ్చి తప్పారని విమర్శించారు. కొత్తగా వచ్చే ప్రభుత్వం సిపిఎస్‌ను రద్దు చేయాలని, లేకుంటే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ఏకగ్రీవంగా నూతన కమిటీ ఎన్నిక ఎపిటిఎఫ్‌ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా గౌరవాధ్యక్షులుగా టెంక చలపతిరావు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా బల్లెడ రవి, బుక్కూరు వెంకటేశ్వర్లును ఎన్నుకున్నారు. సహాధ్యక్షునిగా బలగ శ్రీనివాసరావు, అదనపు కార్యదర్శిగా పొన్నాడ బాలాజీరావు, ఉపాధ్యక్షులుగా ఎం.భుజంగరావు, ఆర్‌.వి అనంత ఆచార్యులు, వై.వి రమణ, బి.నవీన్‌, కార్యదర్శులుగా టి.శివరావు, టి.జోగారావు, ఎస్‌.రాజబాబు, బి.కృష్ణారావు, వి.శ్రీనివాసరావు, బి.చిన్నారావు, బి.వి జితేంద్రను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా యూనియన్‌ సీనియర్‌ నాయకులు డి.ఈశ్వరరావు వ్యవహరించారు.

 

➡️