సోలార్‌తో నిరంతర విద్యుత్‌

సోలార్‌తో అంతరాయం

మాట్లాడుతున్న విద్యుత్‌శాఖ ఎస్‌ఇ కృష్ణమూర్తి

  • పిఎం సూర్య ఘర్‌ పథకాన్ని వినియోగించుకోవాలి
  • ఇపిడిసిఎల్‌ ఎస్‌ఇ ఎన్‌.కృష్ణమూర్తి

ప్రజాశక్తి – పొందూరు

సోలార్‌తో అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్‌ పొందవచ్చని ఎపి ఇపిడిసిఎల్‌ ఎస్‌ఇ నాగిరెడ్డి కృష్ణమూర్తి తెలిపారు. పొందూరు విద్యుత్‌ ఉపకేంద్రంలో ప్రధానమంత్రి సూర్య ఘర్‌ యోజన కార్యక్రమంపై మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం రాయితీపై అందజేస్తున్న సోలార్‌ విద్యుత్‌ను గృహ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వినియోగదారులు తమ ఆండ్రాయిడ్‌ మొబైల్‌లో గూగుల్‌ ప్లేస్టోర్‌, ఆపిల్‌ ప్లే స్టోర్‌ నుంచి పిఎం సూర్య ఘర్‌ మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఈ యాప్‌ ద్వారా పిఎం సూర్య ఘర్‌ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. యాప్‌ డౌన్‌లోడ్‌ అనంతరం రాష్ట్రం, జిల్లా, విద్యుత్‌ సరఫరా సంస్థ పేరు, 15 అంకెల విద్యుత్‌ బిల్లు సర్వీసు నంబరు (గృహ వినియోగదారులు), విద్యుత్‌ బిల్లుకు అనుసంధానమైన మొబైల్‌ నంబరు, ఇ-మెయిల్‌ పొందుపరిచి రిజిస్టర్‌ కావాలన్నారు. యాప్‌ రిజిస్ట్రేషన్‌ అనంతరం మొబైల్‌ నంబరుతో లాగిన్‌ కావాలని తెలిపారు. సోలార్‌ రూఫ్‌ టాప్‌, కిలోవాట్స్‌, సబ్సిడీ, బ్యాంకు వివరాలను పొందుపరిచి అప్లికేషన్‌ సమర్పించాలన్నారు. సోలార్‌ దరఖాస్తుదారుడు ప్రస్తుత గృహ వినియోగ కాంటాక్ట్స్‌ లోడ్‌, అంతకన్నా తక్కువ మాత్రమే వెబ్‌ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. అనంతరం కిలోవాట్స్‌కి సంబంధించిన ఛార్జీలు చెలించాలని చెప్పారు. వెబ్‌ పోర్టల్‌ నుంచి నిర్ధారణ పొందిన తర్వాత విద్యుత్‌శాఖ అధికారులు సంబంధిత గృహ ప్రదేశాన్ని పరిశీలించి సోలార్‌ నెట్‌ మీటరు ఏర్పాటు చేస్తారని చెప్పారు. ఇంటి వద్ద ఉత్పత్తి అయ్యే సోలార్‌ విద్యుత్‌ను వినియోగదారులు తమ అవసరాలకు వాడుకుని మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు పంపించుకోవచ్చన్నారు. భవిష్యత్‌లో సోలార్‌ విద్యుత్‌ వినియోగం బాగా పెరగనుందని తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్‌శాఖ ఇఇలు పి.యోగేశ్వరరావు, జి.సురేష్‌కుమార్‌, డిప్యూటీ ఇఇ యు.వి రమణమూర్తి, ఎఇ డి.రమణమూర్తి, విద్యుత్‌ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

➡️