మాట్లాడుతున్న ఎమ్మెల్యే శంకర్
ఎమ్మెల్యే గొండు శంకర్
శ్రీకాకుళం అర్బన్:
అర్హులైన బిసిలు, ఎస్‌సిలకు ఆయా కార్పొరేషన్ల కింద రుణాలను సకాలంలో అందించాలని ఎమ్మెల్యే గొండు శంకర్ అధికారులను ఆదేశించారు. స్థానిక బిసి కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ఐదేళ్ల తర్వాత తిరిగి వృత్తిపనివారికి ఆదరణ, ఇతర సంక్షేమ పథకాల కింద తక్కువ వడ్డీ రుణాలు పునరుద్దరించామన్నారు. రుణాలు పొందడానికి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల్లో అర్హులను గుర్తించి సకాలంలో రుణాలు అందించేందుకు సహకరించాలని కోరారు. రుణాలు పొందిన వారు తప్పక యూనిట్లు నెలకొల్పి ఆర్థికంగా అభివృద్ది చెందాలన్నారు. ప్రభుత్వం పెద్దఎత్తున రాయితీలు ఇస్తోందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా అధికారులు సహకరించాలన్నారు. సంక్షేమ వసతిగృహాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో బిసి కార్పొరేషన్ ఇడి గడ్డెమ్మ, బిసి సంక్షేమ అధికారి అనురాధ, సాంఘి సంక్షేమ శాఖ డీడీ రెడ్డి, బిసి, ఎస్‌సి కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.