కౌంటింగ్‌ ఫీవర్‌

ఫలితాలు వచ్చేస్తున్నాయి. ప్రజాతీర్పునకు

కేరళలోని వాయినాడ్‌ విహార యాత్రలో ఉన్న దువ్వాడ శ్రీనివాస్‌

  • ఎక్కడ చూసినా ఓట్ల లెక్కింపు పైనే చర్చ
  • ఏర్పాట్లలో తలమునకలవుతున్న అధికార యంత్రాంగం
  • రోజులు దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల్లో మొదలైన టెన్షన్‌
  • విహారయాత్రల్లో సేదదీరుతున్న వైనం

కౌంటింగ్‌కు కౌంట్‌ డౌన్‌ మొదలైంది. ఓట్ల లెక్కింపునకు మరో పది రోజులు మాత్రమే ఉంది. దీంతో అధికార యంత్రాగం ఓట్ల లెక్కింపునకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు జిల్లాలో దాదాపు అన్నిచోట్లా బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. గెలుపోటములపై ఇంకా తీవ్ర చర్చోపచర్చలు జరుగుతున్నాయి. గ్రామాల్లో నాయకుల ఇళ్ల వద్ద పార్టీల వారీగా కూర్చొని లెక్కలు వేసుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో వస్తున్న సర్వేలపై చర్చించుకుంటున్నారు. కొంతమంది నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి ఎడతెరిపిలేని చర్చలు జరుపుతున్నారు. లెక్కలు తేలక తలలు పట్టుకుంటూ జూన్‌ నాలుగు ఎప్పుడు వస్తుందా? అని క్షణమొక యుగంలా గడుపుతున్నారు. ఈ టెన్షన్‌ నుంచి ఉపశమనం కోసం విహార యాత్రలకు వెళ్లారు.

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి

ఫలితాలు వచ్చేస్తున్నాయి. ప్రజాతీర్పునకు రోజులు దగ్గరపడుతున్నాయి. దీంతో అధికారులు లెక్కింపు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ఇంకా అభ్యర్థులు, అనుచరులు కూడికలు, తీసివేతల్లో ఉన్నారు. ఎవరికి వారే అంచనాలు వేసుకుంటూ తమదే పైచేయి అంటూ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోలోపల భయం మాత్రం వెంటాడుతోంది. ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్లను జూన్‌ నాలుగో తేదీన లెక్కించనున్నాయి. ఎచ్చెర్లలోని శ్రీశివానీ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈవిఎంలను కట్టుదిట్టమైన మూడంచెల భద్రత మధ్య స్ట్రాంగ్‌ రూమ్‌లో ఉంచారు. కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌, ఎస్‌పి జి.ఆర్‌.రాధిక ఎప్పటికప్పుడు స్ట్రాంగ్‌ రూమ్‌లను పరిశీలిస్తున్నారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ అధికారులకు దిశానిర్ధేశం చేస్తున్నారు. కౌంటింగ్‌ రోజు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై ఎస్‌పి రాధిక పోలీసు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.కారు రాజా కారుఎన్నికల్లో గెలుపోటములపై జిల్లాలో జోరుగా పందేలు కొనసాగుతున్నాయి. శ్రీకాకుళం, ఆమదావలస నియోజకవర్గాల్లో ఎక్కువ బెట్టింగ్‌లు జరగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా టిడిపి మద్దతుదారులు బెట్టింగ్‌లో ముందున్నట్లు తెలుస్తోంది. పలానా నియోజకవర్గంలో తమ పార్టీయే గెలుస్తుందంటూ ప్రత్యర్థి పార్టీకి సవాల్‌ విసురుతున్న పరిస్థితి నెలకొంది. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో విడివిడిగా, గ్రూపులుగా ఏర్పడి డబ్బులు పందెంగా పెడుతున్నట్లు సమాచారం. తమకు నచ్చిన అభ్యర్థి గెలుపు కోసం రూ.25 వేలు నుంచి రూ.లక్ష వరకు బెట్టింగ్‌కు దిగుతున్నట్లు తెలుస్తోంది. టెక్కలిలో రూ.5 నుంచి రూ.50 వేలు వరకు పందేలు జరగుతున్నట్లు సమాచారం. ఇందులో టిడిపి అభ్యర్థి అచ్చెన్నాయుడే గెలుస్తారని ఎక్కువ మంది బెట్టింగ్‌కు దిగుతున్నట్లు తెలిసింది. ఆమదాలవలసలో వైసిపి గెలిస్తే ఒకటికి రెండు రెట్లు సొమ్ము ఇస్తామంటూ పందెం రాయుళ్లు ఆఫర్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం నియోజకవర్గంలోనూ జోరుగా బెట్టింగ్‌లు కొనసాగుతున్నాయి. టిడిపి అభ్యర్థి గొండు శంకర్‌ గెలవరని గుండ మద్దతుదారులు కొంతమంది పందెం కాస్తున్నట్లు తెలుస్తోంది. ధర్మాన గెలుస్తారని కొంత మంది… శంకర్‌దే విజయమని మరికొందరు బెట్టింగ్‌ చేస్తునట్లు సమాచారం.విహారయాత్రల్లో అభ్యర్థులుపోలింగ్‌కు, కౌంటింగ్‌కు చాలా సమయం ఉండటంతో చాలా మంది అభ్యర్థులు విహారయాత్రలకు వెళ్లినట్లు తెలుస్తోంది. గెలుపోటముల టెన్షన్‌ తట్టుకోలేక కుటుంబ సభ్యులతో కలిసి వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి సేదదీరుతున్నట్లు తెలిసింది. శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం సిమ్లా టూర్‌ వెళ్లినట్లు తెలిసింది. ఆమదాలవలస టిడిపి అభ్యర్థి కూన రవికుమార్‌ గోవా టూర్‌కు వెళ్లినట్లు సమాచారం. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ చెన్నరులోని మధురై, కేరళలోని వాయినాడ్‌ పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది. పాతపట్నం టిడిపి అభ్యర్థి మామిడి గోవిందరావు షిరిడి పర్యటనకు వెళ్లారు. వైసిపి అభ్యర్థి రెడ్డి శాంతి ఢిల్లీలో ఉన్నారు. పలాస టిడిపి అభ్యర్థి గౌతు శిరీష విశాఖలో ఉన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ వైసిపి అభ్యర్థి మంత్రి ధర్మాన ప్రసాదరావు వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌, టిడిపి అభ్యర్థి గొండు శంకర్‌ బెంగుళూరు వెళ్లినట్లు తెలిసింది. ఎచ్చెర్ల వైసిపి అభ్యర్థి గొర్లె కిరణ్‌కుమార్‌, కూటమి అభ్యర్థి ఎన్‌.ఈశ్వరరావు కూడా నియోజకవర్గంలో ఉండి గెలుపుపోటములపై లెక్కలు వేసుకుంటున్నారు. నరసన్నపేటలో వైసిపి, టిడిపి అభ్యర్థులు ధర్మాన కృష్ణదాస్‌, బగ్గు రమణమూర్తిలు నియోజకవర్గంలో ఉండి తమను కలవడానికి వచ్చిన అనుచరులు, నాయకులతో ఫలితాలపై చర్చలు జరుపుతున్నారు. ఇచ్ఛాపురం టిడిపి అభ్యర్థి బెందాళం అశోక్‌ నియోజకవర్గంలో ఉన్నారు. తనను కలవడానికి వస్తున్న ముఖ్యనాయకులు, అనుచరులతో తమకు వచ్చే ఓట్లను లెక్క గడుతూ వారితో గడుపుతున్నారు.

➡️