పులి పాదముద్రలను పరిశీలిస్తున్న అధికారులు
ప్రజాశక్తి- నౌపడ
సంతబొమ్మాళి మండలం హనుమంతు నాయుడుపేట పంచాయతీ పెద్దకేశినాయుడుపేటలో భద్రాచలం శాంతమూర్తికి చెందిన ఆవు దూడను బుధవారం రాత్రి పులి దాడి చేసి చంపేసింది. బాధితుడు శాంతమూర్తి తెలిపిన వివరాల మేరకు తనకు ఉన్న ఐదు ఆవులను ఎప్పటిలాగే బుధవారం రాత్రి తన కొబ్బరి తోటలో కట్టారు. గురువారం ఉదయం తోటకు వెళ్లిన కుటుంబ సభ్యులకు మృతి చెందిన ఆవు దూడ కనిపించింది. రక్తపు మడుగులో ఉన్న ఆవు దూడ, మెడపైన ఘాట్లు, చుట్టు పక్కల గుర్తుతెలియని జంతువుల పాద ముద్రలు గుర్తించారు. అనుమానంతో స్థానిక పోలీసులకు, అటవీశాఖ అధికారులకు, పంచాయతీ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న టెక్కలి అటవీ శాఖ రేంజర్ అధికారి జి.జగదీశ్వరరావు, నౌపడ ఎస్‌ఐ నారాయణస్వామి సిబ్బందితో కలిసి సంఘటనా పరిశీలించారు. ఘటనా స్థలంలో ఉన్న పాదముద్రలు పులి పాద ముద్రలతో పోలి ఉండడంతో మగ పులి అయ్యి ఉంటుందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. సుమారు 14 ఇంచుల పొడవు కలిగిన పాద ముద్రలను గుర్తించి, అది వెళ్లే దిశను పరిశీలించి వివరాల నమోదు చేసుకున్నారు. వెంటనే సంతబొమ్మాళి తహశీల్దార్ ఆర్.రమేష్‌కుమార్‌కు సమాచారం అందించి చుట్టుపక్కల గ్రామాల్లో దండోరా వేయించాలని కోరారు. అలాగే చుట్టుపక్కల గ్రామస్తులు బయటికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని కోరారు. రైతులు తమ పశువులను భద్రత కలిగిన ప్రదేశంలో కట్టుకోవాలని సూచించారు. ఏదైనా జంతువును గుర్తించినట్లయితే స్థానిక పోలీసులకు, అటవీశాఖ అధికారులకు వెంటనే సమాచారం అందించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు ఎప్‌బిఒ జనప్రియ, ఎఫ్‌ఎస్‌ఒ నరేంద్ర, ఎబిఒ చల్లా శ్రీను, సంతబొమ్మాళి పశువైద్యాధికారి అప్పలసూరి, వెటర్నరీ అసిస్టెంట్ సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి అనిల్, ప్రభాస్ పాల్గొన్నారు. మంత్రి అచ్చెన్న ఆరాసంతబొమ్మాళి మండలంలో పులి సంచారం సమాచారంపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. పులి దాడిలో ఒక ఆవు మృతిపై అటవీశాఖ అధికారులతో మాట్లాడి ప్రజలను అప్రమత్తం చేశారు. పెద్ద పులి ఆనవాళ్లు గుర్తించామని, ఒడిశా రాష్ట్రం నుంచి పులి టెక్కలి వైపు వచ్చి ఉంటుందని అటవీశాఖ అధికారులు మంత్రికి వివరించారు. ప్రజలు నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లకుండా అవగాహన కల్పించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో గ్రామాల్లో చాటింపు వేయించి, పోస్టర్లను పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు.