శాస్త్రీయ విద్యతో సృజనాత్మకత

విలియమ్‌కు జ్ఞాపికను అందజేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్‌

విలియమ్‌కు జ్ఞాపికను అందజేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్‌

  • ప్రభుత్వానికి, విద్యార్థులకు ఎస్‌ఎఫ్‌ఐ వారధి
  • డిప్యూటీ డిఇఒ విలియమ్‌

ప్రజాశక్తి – ఆమదాలవలస

విద్యార్థులకు శాస్త్రీయ దృక్పథం గల విద్యనందిస్తూ వారిలో సృజనాత్మక శక్తిని వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరముందని టెక్కలి డిప్యూటీ డిఇఒ విలియమ్‌ అన్నారు. మున్సిపాల్టీ పరిధిలోని చింతాడలో గల జి.ఎల్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్రస్థాయి విద్య, వైజ్ఞానిక శిక్షణా తరగతులు శనివారం ప్రారంభమయ్యాయి. ఈనెల 15వ తేదీ వరకు నిర్వహించే ఈ శిక్షణా తరగతులకు రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 500 మంది విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి విద్యా, వైజ్ఞానిక శిక్షణా తరగతులు సృజనాత్మకతను వెలికితీసేందుకు ఎంతగానో దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, విద్యార్థుల కు మధ్య వారధిగా ఎస్‌ఎఫ్‌ఐ పనిచేస్తోందన్నారు. విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా ఎస్‌ఎఫ్‌ఐ ముందుంటుందన్నారు. రాష్ట్రంలో యువత మత్తు పదార్థాలకు బానిస అవుతోందని, దీని కట్టడికి ప్రభుత్వపరంగా చేస్తున్న కృషికి ఎస్‌ఎఫ్‌ఐ తోడ్పాటు మరింత ఉపయోగపడిందన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ పూర్వ నాయకులు, విశ్రాంత డిప్యూటీ డిఇఒ కొత్తకోట అప్పారావు మాట్లాడుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆవిర్భావం నుంచి విద్యారంగంలో నెలకొన్న సమస్యలు, విద్యార్థుల హక్కుల కోసం ఎస్‌ఎఫ్‌ఐ అలుపెరుగని పోరాటం చేస్తోందని చెప్పారు. విద్యార్థుల్లో నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి ఈ శిక్షణా తరగతులు దోహదపడతాయన్నారు. నిష్ణాతులైన ప్రొఫెసర్లు విద్యార్థులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై అవగాహన కల్పిస్తారని చెప్పారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభించే విద్యారంగ వ్యతిరేక నిర్ణయాలపై ఎస్‌ఎఫ్‌ఐ పోరాడుతోందన్నారు. గత ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోవడంతో విద్యార్థుల ప్రతిఘటనను ఎదుర్కొన్నారని, కొత్తగా ఎన్నికైన ప్రభుత్వాలు విద్యారంగానికి, విద్యార్థులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. విద్యా వ్యవస్థను నాశనం చేసేదిగా ఉన్న నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో పాఠశాలల విలీనాన్ని ఆపాలన్నారు. టిడిపి కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. శాస్త్రీయ ఆలోచన అనే అంశాన్ని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు శ్రీనివాస్‌ బోధించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్నకుమార్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు నవిత, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.చందు, బి.హరీష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️