క్రాస్‌ ఓటింగ్‌ గుబులు

నియోజకవర్గంలో తమకు వచ్చే ఓట్లపై

 

ఎవరికి ఎసరు పెడుతుందోనన్న ఆందోళన

వైసిపి, టిడిపి అభ్యర్థులను వెంటాడుతున్న భయం

శ్రీకాకుళం, పాతపట్నంలో వైసిపికి అనుకూలంగా క్రాస్‌ ఓటింగ్‌

ఎంపీ స్థానంలో టిడిపి వైపు మళ్లిన ఓట్లు

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

నియోజకవర్గంలో తమకు వచ్చే ఓట్లపై అభ్యర్థులు, నాయకుల్లో ఇంకా ఎడతెగని చర్చ నడుస్తోంది. ఈ సందర్భంలో క్రాస్‌ ఓటింగ్‌ పైనా చర్చ నడుస్తోంది. ఇప్పుడు అదే అంశం రెండు పార్టీల అభ్యర్థుల్లోనూ గుబులు రేపుతోంది. క్రాస్‌ ఓటింగ్‌ ఎవరికి ఎసరు తెచ్చిపెడుతుందోన్న భయం అభ్యర్థులను వెంటాడుతోంది. ఎమ్మెల్యే స్థానాలకు శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాల్లో క్రాస్‌ ఓటింగ్‌ సాగినట్లు తెలుస్తోంది. ఇక్కడ వైసిపికి అనుకూలంగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందన్న చర్చ నడుస్తోంది. ఇచ్ఛాఫురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం నియోజకవర్గంలో వైసిపి అభిమానులు కొందరు ఎంపీ రామ్మోహన్‌ నాయుడుపై అభిమానం చూపినట్లు చర్చ నడుస్తోంది.జిల్లాలో ఈసారి ఎన్నికల్లోనూ క్రాస్‌ ఓటింగ్‌ సంప్రదాయం కొనసాగింది. అయితే గతంతో పోలిస్తే ఈ పర్యాయం అంత పెద్దగా లేదనే చర్చ సాగుతోంది. గతానికి భిన్నంగా క్రాస్‌ ఓటింగ్‌ సాగిందని భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో కేవలం ఎంపీ అభ్యర్థి విషయంలోనే క్రాస్‌ ఓటింగ్‌ ఎక్కువగా జరిగింది. అదీ వైసిపి అభిమానులు గతంలో టిడిపి ఎంపీ అభ్యర్థికి ఓటు వేయగా, ఈసారి టిడిపి సానుభూతిపరులు ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓటేయడం కొత్త పరిణామంగా మారింది. శ్రీకాకుళం నియోజకవర్గంలో టిడిపి సానుభూతిపరులు కొందరు ఎమ్మెల్యే స్థానానికి వైసిపికి వేసి, ఎంపీ స్థానానికి టిడిపికి వేసినట్లు చర్చ నడుస్తోంది. ప్రధానంగా శ్రీకాకుళం నగరంలో దీని ప్రభావం ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి గుండ లకీëదేవికి టిక్కెట్‌ ఇవ్వలేదన్న కోపంతో పార్టీ అభిమానులు కొందరు ఫ్యాన్‌ గుర్తుకు వేసినట్లు సమాచారం. టిడిపి గెలిచే అవకాశాలున్న నియోజకవర్గంలో క్రాస్‌ ఓటింగ్‌ ప్రభావంతో ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. పాతపట్నంలోనూ అదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ టిడిపి అభిమానులు కొందరు ఎమ్మెల్యే స్థానానికి ఫ్యాన్‌ గుర్తుకు, ఎంపీ స్థానానికి సైకిల్‌కు వేసినట్లు చర్చ నడుస్తోంది. ఇక్కడ మాత్రం టిడిపి నుంచి వైసిపి వైపు భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లు తెలుస్తోంది.ఎంపీ అభ్యర్థులకూ క్రాస్‌ భయంఎంపీ అభ్యర్థులకు వారికి కచ్చితంగా పడాల్సిన ఓట్లు పడలేదనే చర్చ సాగుతోంది. ప్రధానంగా వైసిపి ఎంపీ అభ్యర్థికి రావాల్సిన ఓటు టిడిపి అభ్యర్థికి మళ్లినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో టిడిపి ఎంపీ అభ్యర్థికి అనుకూలంగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లు సమాచారం. గతంతో పోలిస్తే ఈసారి క్రాస్‌ ఓటింగ్‌ కొంత తక్కువగా ఉందనే చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యే అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తే, ఎంపీ అభ్యర్థికీ అదే సంఖ్యలో ఓట్లు పడాలని వైసిపి అధిష్టానం ఆ పార్టీ అభ్యర్థులకు గట్టిగా చెప్పింది. క్రాస్‌ ఓటింగ్‌ అంశాన్ని ఈసారి సీరియస్‌గా తీసుకోవడంతో, గతం కంటే తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్‌ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు గానూ ఐదుచోట్ల అభ్యర్థులు ఘన విజయం సాధించినా ఎంపీ సీటును వైసిపి కోల్పోయింది. నరసన్నపేట, పలాస, పాతపట్నం స్థానాల నుంచి వైసిపి అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు. నరసన్నపేటలో ధర్మాన కృష్ణదాస్‌కు 19 వేల ఆధిక్యం లభించింది. పలాస నుంచి మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు 16 వేలకు పైగా ఓట్ల మెజార్టీ రాగా, పాతపట్నం నుంచి విజయం సాధించిన రెడ్డి శాంతి 15 వేల ఓట్ల ఆధిక్యం సంపాదించారు. ఎంపీ స్థానానికి వచ్చేసరికి అప్పటి ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ కేవలం 6,653 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దువ్వాడ ఓటమికి క్రాస్‌ ఓటింగే ప్రధాన కారణమని గుర్తించిన పార్టీ అధిష్టానం, ఈసారి ఆ తప్పు జరగనీయకుండా తీసుకున్న జాగ్రత్తలు ఫలించినట్లు తెలుస్తోంది.

➡️