పెండింగ్‌ బిల్లుల వివరాలు ఇవ్వాలి

జిల్లాలో 2014-19 మధ్య

మాట్లాడుతున్న జెడ్‌పి చైర్‌పర్సన్‌ విజయ

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

జిల్లాలో 2014-19 మధ్య కాలంలో అప్పటి టిడిపి ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి పంచాయతీరాజ్‌ శాఖ పెండింగ్‌ బిల్లులతో పాటు రికవరీ జాబితాలను అందజేయాలని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ కోరారు. జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో జెడ్‌పి చైర్‌పర్సన్‌ పిరియా విజయ అధ్యక్షతన జెడ్‌పి స్థాయీ సంఘ సమావేశాలను బుధవారం నిర్వహించారు. 1, 2, 4, 7 స్థాయీ సంఘాలకు ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా జిల్లా సమగ్రాభివృద్ధికి సహకరించాలని కోరారు. కూన రవికుమార్‌ మాట్లాడుతూ పంచాయతీ రాజ్‌ శాఖ వద్ద 2014-2019 మధ్య చేపట్టిన పనులకు బిల్లుల చెల్లింపులో అడ్డంకులు తెలపాలన్నారు. విజిలెన్స్‌, క్వాలిటీ కంట్రోల్‌ విభాగాలు చేపట్టిన రికవరీ వివరాలు లిఖితపూర్వకంగా అందించాలన్నారు. జిల్లాలో నాణ్యమైన విద్యుత్‌ సరఫరా కోసం అవసరమైన 400 కెవి విద్యుత్‌ స్టేషన్‌ ఏర్పాటుకు అవసరమగు నిధులు సమకూర్చేందుకు తనవంతు సహకారాన్ని అందిస్తానన్నారు. నీటి పారుదల శాఖ పరిదిలో శివారు ప్రాంతాలకు ఈ ఏడాది ఖరీఫ్‌ పూర్తయ్యేంత వరకు సాగునీరు అందించాలని సూచించారు. చైర్‌పర్సన్‌ విజయ మాట్లాడుతూ సాగునీరందించడంలో నిర్లక్ష్యం వద్దని, కాలువల మరమ్మతులు ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించి అన్ని ప్రాంతాల రైతులకు సాగునీరు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. పర్యాటక శాఖ పై జరిగిన సమీక్షలో రవికుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో ఎచ్చెర్ల, ఇచ్ఛాపురం నియోజకవర్గాలకే టూరిజం పనులను పరిమితం చేశారని, మిగిలిన ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధికి తగిన ప్రాదాన్యత ఉండేలా ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. గ్రామ పంచాయతీలలో అక్రమ లే అవుట్లలో చేపట్టిన నిర్మాణాలపై పన్నుల వసూళ్ల వివరాలు తెలియజేయాలని డిపిఒను కోరారు. రోడ్లు మరియు భవనాల శాఖ పై జరిగిన చర్చలో ఎస్‌ఇ జాన్‌ సుధాకర్‌ మాట్లాడుతూ జిల్లాలో రోడ్ల గుంతలు పూడ్చడానికి ప్రభుత్వం రూ.11 కోట్లు కేటాయించిందని, త్వరలో పనులు చేపడతామని చెప్పారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, వ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయ చర్యలపై రైతుల్లో అవగాహన కల్పించాలని చైర్‌పర్సన్‌తో పాటు కంచిలి, కవిటి, సోంపేట జెడ్‌పిటిసి సభ్యులు కోరారు. సమావేశాల్లో పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, జెడ్‌పి సిఇఒ ఆర్‌.వెంకట్రామన్‌, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️