అధికారులతో చర్చిస్తున్న ఎమ్మెల్యే శంకర్
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
శ్రీకాకుళం నియోజకవర్గం అభివృద్ధికి జిల్లా అధికారులు పూర్తిస్థాయిలో సహకారం అందించాలని ఎమ్మెల్యే గొండు శంకర్ కోరారు. జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో పలు శాఖల ఉన్నతాధికారులు, శ్రీకాకుళం, గార మండలస్థాయి అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. రెండు మండలాల ఎంపిడిఒలు, ఇఒపిఆర్‌డి, విద్యాశాఖాధికారులు నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన ప్రధాన అంశాలను నివేదించారు. దీని ఆధారంగా అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తానని హామీనిచ్చారు. మౌలిక వసతుల్లో ప్రధానంగా తాగునీరు, గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, సిసి రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం, పంచాయతీ, భవనాలు నిర్మాణం, గ్రేడియేషన్ ఆఫ్ పంచాయతీ, సెక్రటరీల ఉద్యోగోన్నతులు తదితర అంశాలపై చర్చించారు. జిల్లాపరిషత్ నుంచి సాధారణ నిధులతో మంజూరు చేసిన అభివృద్ధి పనులను ప్రారంభించాలని కోరారు. గతంలో మంజూరు చేసి మొదలుపెట్టిన పనులన్నింటినీ కొనసాగిస్తూ వాటిని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరిన్ని నిధులు కేటాయించాలని జెడ్‌పి సిఇఒ శ్రీధర్ రాజాను కోరారు. శ్రీకూర్మం, గార, సింగుపురం, కళింగపట్నం వంటి మేజర్ పంచాయతీల్లో సైతం మౌలిక వసతుల్లేవని వాటిని సమకూర్చడానికి తోడ్పాటు అందించాలని ఎమ్మెల్యే కోరారు. జెడ్‌పి నిధులతో రోడ్లు వేసుకునే అవకాశాలను పరిశీలించాలన్నారు. పంచాయతీరాజ్, మండల పరిషత్ అధికారులతో చర్చించి అభివృద్ధి పనులు తగిన ప్రాధాన్యతనిస్తామని సిఇఒ చెప్పారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి భారతి సౌజన్య, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.