ఎల్‌ఐసి పెన్షనర్ల ధర్నా

ఎల్‌ఐసిలో పనిచేసిన ఉద్యోగుల ఉద్యోగ విరమణ

ఎల్‌ఐసి కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న పెన్షనర్లు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ఎల్‌ఐసిలో పనిచేసిన ఉద్యోగుల ఉద్యోగ విరమణ అనంతరం పెన్షన్‌ అప్‌డేట్‌, క్యాష్‌ మెడికల్‌ బెనిఫిట్‌ తదితర సమస్యలను యాజమాన్యం పరిష్కరించకుండా కొన్నేళ్లుగా తాత్సారం చేస్తోందని ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఐసిఆర్‌ఇఎ) శ్రీకాకుళం బ్రాంచ్‌ అధ్యక్ష, కార్యదర్శులు కె.నారాయణ, ఎం.ఆదినారాయణ మూర్తి విమర్శించారు. సమస్యల పరిష్కారం కోరుతూ నగరంలోని ఎల్‌ఐసి శ్రీకాకుళం డివిజన్‌ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఐసిఆర్‌ఇఎ ఆధ్వర్యాన పెన్షనర్లు శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెన్షన్‌ అప్‌డేషన్‌ చేపట్టకపోవడం వల్ల పెన్షన్‌దారులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1986కు ముందు రిటైర్‌ అయిన ఉద్యోగుల ఎక్స్‌గ్రేషియో పెంచాలని డిమాండ్‌ చేశారు. ఎల్‌ఐసిలో కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్నారు. ఏజెంట్లకు వ్యతిరేకంగా ఉన్న ఐఆర్‌డిఎ నిబంధనలను తొలగించాలన్నారు. ఏజెంట్ల కమిషన్‌ కుదింపు వంటి చర్యలు ఎల్‌ఐసిని నిర్వీర్యం చేసే విధంగా ఉన్నాయని చెప్పారు. పాలసీ సరెండర్‌ పీరియడ్‌ ఏడాదికి తగ్గింపు, ప్రాఫిట్‌ పార్టిసిపేటింగ్‌ పాలసీల కుదింపు వంటి చర్యలను తప్పుపట్టారు. ధర్నాకు ఐసిఇయు తరుపున మెట్ట మధుసూదనరావు, జి.శ్రీరామ్మూర్తి, ఎన్‌ఎఫ్‌ఐఎఫ్‌డబ్ల్యుఐ తరుపున జిల్లా అధ్యక్షులు డోల తారక రామారావు, సీనియర్‌ నాయకులు డి.వి నరసింహారావు, క్లాస్‌ వన్‌ ఆఫీసర్స్‌ ఫెడరేషన్‌ తరుపున శ్రీలక్ష్మి సంఘీబావం తెలిపారు. కార్యక్రమంలో యూనియన్‌ సీనియర్‌ నాయకులు వి.జి.కె మూర్తి, ఎం.ప్రభాకరరావు, బి.శివాజీ, డి.అచ్యుతరావు, ఐ.వెంకటేశ్వరరావు, కె.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

 

➡️