రాష్ట్రంలో నియంతృత్వ పాలన

రాష్ట్రంలో నియంతృత్వ

ఎఎస్‌పికి వినతిపత్రం అందజేస్తున్న వైసిపి నాయకులు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్‌ విమర్శించారు. వైసిపి నాయకులు, అభిమానులు, సోషల్‌ మీడియా కార్యకర్తలపై కక్షసాధింపులు, వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అక్రమ అరెస్టులపై నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో వైసిపి నాయకులతో కలిసి ఎఎస్‌పి పి.శ్రీనివాసరావుకు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి సోషల్‌ మీడియా కార్యకర్తలపై ప్రభుత్వం కక్షకట్టి అక్రమ కేసులు పెడుతోందన్నారు. తప్పుడు కేసులు బనాయించి వారిని, వారి కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేస్తోందని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను విమర్శించిన వారిని, అక్రమాలను ప్రశ్నిస్తున్న వారిని అక్కసుతో అరెస్టులు చేస్తోందన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పక్కనపెట్టి పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు ఎవరి మెప్పు కోసమో కాకుండా చట్టప్రకారం పనిచేయాలన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ కుమార్‌, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ ఎం.వి పద్మావతి, వైసిపి నాయకులు పొన్నాడ రుషి, ఎడ్ల వెంకట్‌, అంబటి శ్రీను, ముంజేటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️