ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి
ధాన్యం కొనుగోలు విషయంలో పాలకుల మాటలకు అర్ధాలే వేరులే అన్నట్లుగా ఉంది. చివరి గింజ వరకూ కొంటామని వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నుంచి ఎమ్మెల్యే వరకు చెప్తే రైతులు నిజమనే నమ్మారు. ధాన్యం కొనుగోలుకు లక్ష్యమంటూ లేదని ఎంతైనా కొంటామంటూ ప్రజాప్రతినిధులు, అధికారులు నమ్మించారు. చివరిలో మాత్రం లక్ష్యమైపోయిందంటూ చేతులేత్తేశారు. లక్ష్యం పూర్తయిందనే పేరుతో జిల్లాలో 20 మండలాల్లో ధాన్యం కొనుగోలు ఆపేయడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. అందరూ పండగ సంతోషంలో ఉంటే అన్నం పేట్టే అన్నదాత మోములో ఆ ఆనందఛాయలు కనిపించడం లేదు. చేతికందిన పంటను విక్రయించి కుటుంబంతో ఆనందంగా సంక్రాంతి నిర్వహించుకోవాలన్న వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. జిల్లాలో 2024 ఖరీఫ్ సీజన్‌లో సంవత్సరం తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. రైతుల అవసరాలు, తిండి గింజలకు పోను 5 లక్షల ధాన్యం వరకు మార్కెట్‌లోకి రావొచ్చని పౌర సరఫరాల సంస్థ అధికారులు అంచనా వేశారు. అన్ని లెక్క గట్టి చివరకు 4.90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు. కొనుగోలుకు ముందు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో జిల్లాలో రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలుపై సమీక్ష తర్వాత లక్ష్యంలో ఏ మార్పు కనిపించలేదు. అధికారులు తొలుత ఏది నిర్ణయించారో? ఆ మేరకే ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేసి సేకరణ మొదలు పెట్టారు. జిల్లా లక్ష్యానికి అనుగుణంగా ఆయా మండలాలకు లక్ష్యాలను నిర్ధేశించారు. దీంతో శ్రీకాకుళం, గార, నరసన్నపేట, జలుమూరు, సారవకోట, పలాస, మెళియాపుట్టి, జి.సిగడాం, సంతబొమ్మాళి, టెక్కలి, బూర్జ, కోటబొమ్మాళి, నందిగాం, ఎల్‌ఎన్‌పేట, కొత్తూరు, హిరమండలం, సరుబుజ్జిలి, పోలాకి తదితర మండలాల్లో లక్ష్యం పూర్తయిందనే పేరుతో కొనుగోలు ఆపేశారు. ధాన్యం కొనుగోలు కోసం ఏటా రైతులు ఎదురు చూడాల్సిన పరిస్థితిని పాలకులు కల్పిస్తున్నారు. ఏటా ఇదే సమస్య తలెత్తుతున్నా దాని పరిష్కారంపై ప్రభుత్వమూ దృష్టి సారించడం లేదు. గత సంవత్సరం రైతుల దగ్గర ధాన్యం నిల్వలు ఉంటుండగానే కొనుగోలు ఆపేశారు. మిల్లర్ల అసోసియేషన్ నాయకులు అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావును కలవడంతో అయన పౌర సరఫరాల సంస్థ అధికారులకు ఫోన్ చేసి అదనంగా ధాన్యం కొనాలని రికమెండ్ చేశారు. మరోవైపు రైతుల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో ప్రభుత్వం తొలి విడతలో కొంచెం, ఆ తర్వాత మరికొంత పరిమాణంలో కొసిరి కొసిరి కొనుగోలు చేసింది. ఇప్పుడు అదే పరిస్థితి వచ్చినా మంత్రి అచ్చెన్నాయుడు మాత్రం రైతులపై సానుకూలంగా స్పందించినట్లు కనిపించడం లేదు. ధాన్యం కొనుగోలు చేయమని చెప్పకుండా కేవలం సాంకేతిక సమస్యలు మాత్రమే పరిష్కరించాలని చెప్పినట్లు తెలిసింది. సాంకేతిక సమస్యలతో ధాన్యం కొనుగోలుకు ట్రక్ షీట్లు జనరేట్ కాకపోవడం సమస్యను జిల్లా అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా సమస్య పరిష్కారమైపోతుంది. అది పెద్ద సమస్య కాదు. ధాన్యం సేకరణ లక్ష్యం పెంచి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయడం ఇప్పుడు అందరి ముందు ఉన్న తక్షణ కర్తవ్యం. ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, పొందూరు, ఆమదాలవలస, జి.సిగడాం, గార తదితర మండలాల్లో ఆలస్యంగా నూర్పులు చేపట్టడంతో డిసెంబరు చివరి వారంలో పంట చేతికొస్తుంది. తమ మండలాల రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు చేయాలని కొంత మంది ఎమ్మెల్యేలు అధికారులపై ఒత్తిడి చేస్తున్న పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ధాన్యాన్ని తమ మండలాలకు సర్దుబాటు చేయొద్దంటూ మరోవైపు కొందరు ఎమ్మెల్యేలు అధికారులకు చెప్తున్నారు. లక్ష్యం పూర్తయిందనే పేరుతో ఆపేసిన మండలాల్లో రైతుల వద్ద ఎంత మేర ధాన్యం నిల్వలు ఉంటే అంత పరిమాణంలో ప్రభుత్వం కొనుగోలు చేస్తేనే దీనికి పరిష్కారం దొరుకుతుంది. ప్రభుత్వ నిర్ణయాల్లో భాగస్వామిగా ఉన్న వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ధాన్యం కొనుగోలు లక్ష్యం పెంచడం అమాత్యునికి పెద్ద సమస్య కాదు. జిల్లా రైతుల ప్రయోజనాల కోసం ఆయన మేరకు కృషి చేస్తారో వేచి చూడాల్సి ఉంది.