విందు… వినోదం

సంక్రాంతి పర్వదినాల్లో చివరి రోజైన కనుమ పండగ

ఇచ్ఛాపురం : మాంసాన్ని కొనుగోలు చేస్తున్న ప్రజలు

భారీగా పెరిగిన మాంస విక్రయాలు

పెరిగిన మద్యం అమ్మకాలు

జిల్లాలో పలుచోట్ల జాతరలు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

సంక్రాంతి పర్వదినాల్లో చివరి రోజైన కనుమ పండగ జిల్లాలో భలే పసందుగా సాగింది. పల్లెల్లో గోసేవ నిర్వహించి ఆవులకు పొంగళి తినిపించడం ఈ వేడుక ప్రత్యేకత. దీనికి తోడు మాంసాహార, మద్యం ప్రియులకు ఈ వేడకల్లో పట్టలేని ఆనందం. బుధవారం కనుమ కావడంతో మాంసాహారులను ఆపటం ఎవరి తరమూ కాలేదు. అన్‌స్టాప్‌బుల్‌గా ఆరగించేశారు. సాయంత్రం సినిమా థియేటర్లు, ఎగ్జిబిషన్లు, ఆలయాలు, జాతలను సందర్శించి కుటుంబాలతో సరదాగా గడిపారు. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల నిర్వహించిన యాత్రలకు జనం పోటెత్తారు. ఉపాధి, ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా సొంత ఊళ్లకు చేరడంతో గ్రామీణ ప్రాంతాల్లో వేడుకలు ఘనంగా సాగాయి. పండగల పసందు కనుమ విందుతో ముగిసింది. కనుమ, పైగా బుధవారం కావడంతో మాంసం విక్రయాలు జోరుగా సాగాయి. జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలన్న తేడా లేకుండా అన్నిచోట్లా మాంసాల కొనుగోళ్లతో ఆ దుకాణాలు రద్దీగా మారాయి. మటన్‌, నాటుకోడి మాసం ధరలు ఆకాశానికి అంటుకుని సమాన ధర పలికాయి. వేకువ జాము నుంచే ఈ దుకాణాల వద్ద జనం క్యూ కట్టారు. మటన్‌ ధర కిలో రూ.వెయ్యి నుంచి రూ.1100 వరకు విక్రయిం చారు. నాటుకోడి మాంసం కిలో లైవ్‌ రూ.700 వరకు విక్రయించారు. ఆపై ఖర్చుతో కలుపుకుని నాటుకోడి మాంసం కిలో రూ.800 నుంచి 900 మధ్య విక్రయించారు. బాయిలర్‌ చికెన్‌ ధర కిలో రూ.200 నుంచి రూ.240కి పెంచి విక్రయిం చారు. చేపల ధరలూ సైజు బట్టి పెరిగాయి. విందులో మందుమద్యం ప్రియులు ఈ వేడుకల్లో ఆనందడోలికల్లో తేలియాడారు. చుక్క ముక్కతో తెగ ఆనందించారు. జిల్లాలో 158 మద్యం షాపులు, 17 బార్లు ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబరు 31న జిల్లాలో ఒక్క రోజున రూ.2.10 కోట్లు విక్రయాలు జరిగాయి. సంక్రాంతి పర్వదినాలైన ఈ మూడు రోజుల్లో సుమారు రూ.20 నుంచి 25 కోట్లు మద్యం అమ్మకాలు జరిగి ఉంటుందని అంచనా. వీటికి తోడు జవాన్ల కోసం క్యాంటీన్లలో విక్రయించిన మద్యం జిల్లాలో విస్తారంగా వినియోగంలో ఉంది. మద్యం అమ్మకాల్లో అత్యంత కీలకంగా కనుమ రోజును భావిస్తారు. అదేస్థాయిలో అమ్మకాలు సాగాయని అధికారులు చెబుతున్నారు. కనుమ రోజున పలు రకాల కార్యక్రమాల్లో పాల్గొని ఆనందించారు. కొత్త సినిమాలను చూసేందుకు జనం ఎగబడ్డారు. ఈ ఏడాది గేమ్‌ ఛేంజరు, డాకూ మహారాజ్‌, పండగ వచ్చింది పెద్ద సినిమాలు కాగా, ఇతర చిన్న సినిమాలు విడదల కావడంతో సినిమాలకు జనం క్యూకట్టారు. దీంతో థియేటర్ల ప్రాంగణాలన్నీ జన సందోహంగా మారాయి. ఆలయాలకు, నగరంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లు, పార్కులకు వెళ్లి ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. జన జాతరకనుమ సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో జాతరలు నిర్వహించారు. జాతర్లకు పిల్లా పాపలు, కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆమదాలవలస ప్రాంతంలోని సంగమేశ్వర ఆలయ ప్రాంతంలో నిర్వహించిన జాతరకు సమీప ప్రాంతాల నుంచి భారీగా జనం తరలివచ్చారు. శ్రీకాకుళం రూరల్‌ మండలం పెద్దపాడు అప్పనమ్మతల్లి దేవాలయం వద్ద నిర్వహించిన జాతరకు పెద్దఎత్తున పాల్గొన్నారు. పాతపట్నం మండలం నీలమణిదుర్గమ్మ ఆలయ సందర్శనకు సందర్శకులు పోటెత్తారు. నరసన్నపేట మండలం జల్లువానిపేటలోని దానప్పతల్లి ఆలయం, కిటకిటలాడాయి. ఆమదావలస సంగమయ్య కొండ జాతర, పలాసలోని దేకురుకొండ, యాత్రలు జిల్లాలో నిర్వహించారు. ఈ యాత్రలు వినోదాన్ని పంచాయి. ఈ యాత్రలకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలతో పాటు ఒడిశా నుంచి భారీగా జనం తరలిరావడంతో యాత్రా స్థలాలు సందడిగా కనిపించాయి. మాంసం దుకాణాల వద్ద రద్దీఇచ్ఛాపురం : ఇచ్ఛాపురంలో బుధవారం కనుమ పండగ సందర్భంగా జోరుగా భారీగా మాంస విక్రయాలు సాగింది. వేకువ జామున నుంచే మాంసం కోసం దుకాణాల్లో ఎగబడ్డారు. ఒక్క రోజే రూ.లక్షల వ్యాపారం సాగింది. మెయిన్‌ రోడ్డులోని మటన్‌ దుకాణాల సాపుల వద్ద రద్దీ కనిపించింది. మేకలు, కోళ్లు కొనుగోలు చేసుకుని వాటాలు వేసుకున్నారు. ఎక్కడ చూసినా సాధారణ కాయగూరలు వద్ద కన్న మటన్‌ దుకాణాల వద్ద ప్రజలు బారులు తీరారు.

 

➡️