అన్యాయం జరిగితే సహించం

సంతబొమ్మాళి మండలంలోని మూలపేట పోర్టులో పనిచేస్తున్న

ఆందోళన చేస్తున్న మూలపేట నిర్వాసితులు

తొలగించిన వారిని పనిలోకి తీసుకోవాలి

మూలపేట పోర్టు వద్ద నిర్వాసితుల ఆందోళన

ప్రజాశక్తి – నౌపడ

సంతబొమ్మాళి మండలంలోని మూలపేట పోర్టులో పనిచేస్తున్న నిర్వాసిత గ్రామాలైన మూలపేట, విష్ణుచక్రంకు చెందిన 17 మందిని ఉద్యోగాల నుంచి తొలగించడంతో నిర్వాసితులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. స్థానిక సర్పంచ్‌ జీరు బాబూరావు ఆధ్వర్యాన గ్రామస్తులు పోర్టులోకి ప్రవేశించి ఉద్యోగాల తొలగింపుపై పోర్టు అధికారులను నిలదీశారు. ఉద్యోగాల నుంచి తొలగించడానికి కారణాలను అడిగినా పోర్టు అధికారులు చెప్పకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాధానం చెప్పాలని నిర్వాసితులు గట్టిగా నిలదీయడంతో స్థానిక టిడిపి నాయకులు చెప్పడం వల్ల తొలగించామని బదులివ్వడంతో మండిపడ్డారు. పోర్టు నిర్మాణానికి సహకరించని వాళ్లు భూముల్లో పంట సాగు చేసుకుంటున్నారని, సర్వం త్యాగం చేసిన తమపై రాజకీయ కక్షసాధింపులు ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఇలా అయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పది రోజుల పాటు మూలపేట గ్రామస్తులకు పని ఆపుతున్నారని, మిగతా గ్రామస్తులకూ పది రోజులు పని ఆపాలన్నారు. పది రోజుల తర్వాత నిర్వాసిత గ్రామాలైన మూలపేట, విష్ణుచక్రం గ్రామస్తులందరికీ పోర్టులో పని కల్పించాలని కోరారు. అప్పటివరకు బ్రేక్‌ వాటర్‌ పనులు చేసుకోవాలన్నారు. పోర్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, నిర్వాసితులందరికీ ఉద్యోగావకాశాలు కల్పించాలని పోర్టు డిజిఎం ఉమామహేశ్వర రెడ్డి, హెచ్‌ఆర్‌ మేనేజర్లు సంతోష్‌, వినోద్‌, ప్రవీణ్‌ను కోరారు. నిర్వాసితుల ఆందోళన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా టెక్కలి సిఐ సూర్య చంద్రమౌళి, నౌపడ ఎస్‌ఐ కిషోర్‌ వర్మ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

 

➡️