సబ్సిడీపై వ్యవసాయ పరికరాల అందజేతకు ప్రభుత్వ నిర్ణయం
జిల్లాకు 1903 యూనిట్లు లక్ష్యం
ఈనెల 26 లోగా ఆర్‌ఎస్‌కెల్లో దరఖాస్తులకు అవకాశం
అప్పుడే మొదలైన సిఫార్సులు
రైతులకు వ్యవసాయ ఖర్చులను తగ్గించేందుకు ప్రభుత్వం పలురకాల యంత్ర పరికరాలను అద్దె ప్రాతిపదికన అందించాలని గతంలో వైసిపి ప్రభుత్వం నిర్ణయించినా, అది ఆచరణకు నోచుకోలేదు. అధికారంలోకి వచ్చిన టిడిపి కూటమి ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు పరికరాలను అందించాలని నిర్ణయించింది. రైతులకు ఎటువంటి పరికరాలు అవసరమో వ్యవసాయశాఖ అధికారులు గుర్తించి, ప్రభుత్వానికి ఐదు నెలల కిందటే నివేదిక పంపారు. ప్రభుత్వం ఆమోదం తెలపడంతో రైతులకు వాటిని అందించేందుకు అధికారులు కార్యాచరణ మొదలుపెట్టారు. ఈనెల 26వ తేదీ లోపు రైతుసేవా కేంద్రాల్లో (ఆర్‌ఎస్‌కె) దరఖాస్తు చేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు.
ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి
జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్‌ల్లో కలిపి సుమారు 6.20 లక్షల ఎకరాల్లో పలురకాల వ్యవసాయ పంటలు సాగవుతున్నాయి. వీటితోపాటు జిల్లాలో లక్ష ఎకరాల్లో కొబ్బరి, జీడి, మామిడి తదితర పంటలు సాగవుతున్నాయి. 249 ఎకరాల్లో పట్టు సాగవుతోంది. లక్షల ఎకరాల్లో వరి, ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. పంటల సాగు సందర్భంలో రైతులు ట్రాక్టర్లు, రోటోవేటర్లు, దుక్కు, దమ్ము, నాట్లు, కలుపు తీసే యంత్రాలను కొందరు చేతి డబ్బులు పెట్టుకుని కొనుక్కోవాల్సి వస్తోంది. మరికొందరు అద్దెకు తీసుకుని వినియోగిస్తున్నారు. రైతులపై భారం తగ్గించడంతో పాటు వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు రైతులకు యంత్ర పరికరాలను ప్రభుత్వాలు అందిస్తూ వస్తున్నాయి. గత వైసిపి ప్రభుత్వం రాయితీపై కాకుండా అద్దె ప్రాతిపదికన రైతులకు యంత్ర పరికరాలను అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం రైతు సేవా కేంద్రాల్లో కస్టమ్ హైరింగ్ సెంటర్లు (సిహెచ్‌సి)ను ఏర్పాటు చేసి రూ.15 లక్షల వరకు విలువ చేసే యంత్రాలను రైతులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. రైతు సంఘాలనూ ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియనూ పూర్తి చేశారు. రైతులకు మాత్రం పరికరాలను అందించలేదు.జిల్లా లక్ష్యం 1903 యూనిట్లువ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా జిల్లాకు సంబంధించి 1903 యూనిట్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వం జిల్లాకు రూ.2.87 కోట్లను కేటాయించింది. మండలాల వారీగా లక్ష్యాలను రూపొందించి అర్హులైన రైతులను ఎంపిక చేయనున్నారు. బ్యాటరీ స్ప్రేయర్స్‌ను 600 మందికి, పవర్ ఆపరేటెడ్ స్ప్రేయర్స్‌ను 500 మందికి, ట్రాక్టర్‌తో నడిచే యంత్రాలను 730 మందికి అందించనున్నారు. వీటితోపాటు పవర్ టిల్లర్స్ పది మందికి, బ్రష్ కట్టర్స్ 15 మందికి ఇవ్వనున్నారు. రైతులు తమకు కావాల్సిన పరికరాల కోసం రైతు సేవా కేంద్రాల్లో ఈనెల 26వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. యంత్ర పరికరాల పంపిణీ కోసం ప్రభుత్వం జిల్లాలో పది మంది డీలర్లను ఎంపిక చేసింది. రైతు తనకు నచ్చిన ఏజెన్సీ నుంచి పరికరాలను పొందే వెసులుబాటు కల్పించింది. పరికరం రకాన్ని బట్టి 40 నుంచి 50 శాతం సబ్సిడీ చెల్లించనుంది. సబ్సిడీయేతర మొత్తాన్ని సంబంధిత డీలర్లకు చెల్లించి పరికరాలను తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మొదలైన సిఫార్సులుప్రభుత్వం సబ్సిడీపై అందించనున్న యంత్ర పరికరాలపై రైతుల్లో చాలా డిమాండ్ నెలకొంది. ఎంపిక కోసం ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను సూచించింది. రైతు గత ఐదేళ్లలో యంత్ర పరికరాలను తీసుకొని ఉండకూడదని షరతు విధించింది. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇవ్వనున్నట్లు పేర్కొంది. నిబంధనల ప్రకారం ఎంపిక చేస్తే సామాన్య రైతులకు సైతం మేలు చేకూరుతుంది. 2014-19 కాలంలో టిడిపి ప్రభుత్వ హయాంలో రాజకీయ సిఫార్సులున్న వారికే కట్టబెట్టారన్న విమర్శలు వెల్లువెత్తాయి. టిడిపి నేతల ఇళ్లలో పరికరాలు దర్శనం ఇచ్చిన ఘటనలు వెలుగు చూశాయి. ఇప్పుడూ అదే కథ పునరావృతం అవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.