ఎన్నికలు ముగిశాయన్న నిర్లక్ష్యం వద్దు

ఎన్నికల తర్వాత మన ప్రాంతం

మాట్లాడుతున్న విశాఖ రేంజ్‌ డిఐజి విశాల్‌ గున్ని

విశాఖ రేంజ్‌ డిఐజి విశాల్‌ గున్ని

ప్రజాశక్తి – విజయనగరం కోట

ఎన్నికల తర్వాత మన ప్రాంతం ప్రశాంతంగా ఉందన్న నిర్లక్ష్యం వద్దని, మరో 15 రోజులు ప్రతిఒక్కరూ ఇదే అప్రమత్తతతో పనిచేయాలని విశాఖ రేంజ్‌ డిఐజి విశాల్‌ గున్ని పోలీసు అధికారులను ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత చోటుచేసుకున్న సంఘటనలు, తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై విశాఖపట్నం రేంజ్‌ పరిధిలోని విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల ఎస్‌పిలు, ఇతర పోలీసు అధికారులతో డిఐజి స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు నెలలుగా రేంజ్‌ పరిధిలో పోలీసు అధికారులు, సిబ్బంది చాలా కష్టపడి, ప్రణాళికాబద్ధంగా క్షేత్రస్థాయిలో సమర్థవంగా పనిచేయడం వల్ల సార్వత్రిక ఎన్నికల్లో చిన్న చిన్న సంఘటనలు మినహా ప్రశాంతంగా నిర్వహించుకోగలిగామని చెప్పారు. అందుకు కృషి చేసిన అధికారులు, సిబ్బందిని అభినందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని, మన ప్రాంతంలో ఎటువంటి శాంతిభద్రతల సమస్యలూ ఉత్పన్నం కాకుండా క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పోలింగ్‌కు కొద్దిరోజుల ముందు, పోలింగు రోజు, పోలింగ్‌ తర్వాత గ్రామాల్లో చోటుచేసుకున్న చిన్న చిన్న సంఘటనలపై నిర్లక్ష్యం వద్దన్నారు. ఆయా గ్రామాలను అధికారులు పలుమార్లు సందర్శించాలని, గ్రామ పెద్దలు, గ్రామస్తులతో మమేకమై, వారిని వివాదాలకు దూరంగా ఉండాలని, శాంతియుతంగా మెలగాలని విజ్ఞప్తి చేయాలని సూచించారు. గ్రామాల్లో చురుగ్గా ఉన్న వ్యక్తులు, రాజకీయంగా వివాదాలు సృష్టించే వ్యక్తులను గుర్తించి, వారిని పోలీస్‌స్టేషనుకు పిలిచి కౌన్సెలింగ్‌ చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో రాజకీయ పార్టీలకతీతంగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఓటు వేసేందుకు ఇతర ప్రాంతాల నుండి స్వగ్రామాలకు వచ్చిన వ్యక్తులు వలన ఏమైనా సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న వారిని గుర్తించి, వారిపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలన్నారు. వివాదాలు తలెత్తేందుకు అవకాశమున్న గ్రామాలను గుర్తించి, పోలీసు పికెట్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయా గ్రామాల్లో పరిస్థితులు, సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలపాలన్నారు. ఇవిఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద మూడంచెల భద్రతను ఇప్పటికే ఏర్పాటు చేశామని, వాటిని నిరంతరం అధికారులు తనిఖీలు చేపట్టి, భద్రతను పర్యవేక్షించాలన్నారు. వచ్చే 15 రోజులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని, ఏ చిన్న సంఘటనను తేలిగ్గా తీసుకోవద్దన్నారు. రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, వివాదాలు జరిగేందుకు అవకాశం ఉన్న గ్రామాలను, వ్యక్తులను గుర్తించి, ప్రత్యేకంగా నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం, ఎన్నికల తరువాత వివిధ పోలీసు స్టేషనుల్లో నమోదైన కేసులను విశాఖ రేంజ్‌ డిఐజి సమీక్షించి, దర్యాప్తులో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. జూన్‌ 4న జరిగే కౌంటింగు నిర్వహించే కేంద్రాల వద్ద కూడా భద్రత ఏర్పాట్లు చేపట్టాలని, వాటిని జిల్లా ఎస్‌పిలు ముందుగానే సమీక్షించాలన్నారు. సమావేశంలో విజయనగరం, మన్యం, శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరి జిల్లా ఎస్‌పిలు ఎం.దీపిక, విక్రాంత్‌ పాటిల్‌, జి.ఆర్‌ రాధిక, కె.వి మురళీకృష్ణ, తుషీం సిన్హా, ఎఎస్‌పిలు అస్మా ఫర్వీన్‌, ప్రేమ్‌ కాజల్‌, ఒ.దిలీప్‌ కిరణ్‌, సునీల్‌ షరోన్‌, ట్రెనీ ఐపిఎస్‌ ఎం.జావలి, డిఎస్‌పిలు, సిఐలు పాల్గొన్నారు.

 

➡️