డిఎస్‌సి నోటిఫికేషన్‌లో మైనార్టీలకు అన్యాయం

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డిఎస్‌సిలో ముస్లిం

వినతులను స్వీకరిస్తున్న డిఆర్‌ఒ వెంకటేశ్వరరావు

బ్యాక్‌లాగ్‌ పోస్టులకు రిజర్వేషన్‌ కల్పించాలని వినతి

‘మీకోసం’కు 154 వినతులు

ప్రజాశక్తి – శ్రీకాకుళం

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డిఎస్‌సిలో ముస్లిం మైనార్టీలకు అన్యాయం జరుగుతోందంటూ వివిధ మండలాల నుంచి పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీ అభ్యర్థులు వినతులను అందజేశారు. ప్రధానంగా ఎస్‌ఎ లాంగ్వేజ్‌ ఉర్థూను డిఎస్‌సి జాబితాలో చూపించలేదని, అలాగే బ్యాక్‌లాగ్‌ పోస్టులను అందులో పొందు పరచకపోవడం వల్ల రిజర్వేషన్‌లో కోటా తగ్గుతోందని ఫరియా అహ్మద్‌, సుజీత్‌ మహ్మద్‌లు వివరించారు. నగరంలోని జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమం సోమవారం నిర్వహించారు. డిఆర్‌ఒ ఎం.వెంకటేశ్వరరావు, ప్రత్యేక ఉప కలెక్టర్‌ పద్మావతి, జిల్లా పరిషత్‌ సిఇఒ శ్రీధర్‌రాజా తదితరులు పాల్గొని వినతులను స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా 154 వినతులు వచ్చాయి. గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రభుత్వ భూములను గుర్తించి జిల్లా గెజిట్‌లో ప్రకటించాలని ఆర్‌టిఐ ఉద్యమ నాయకుడు అనపాన షణ్ముఖరావు వినతిపత్రం అందజేశారు. నీటి వనరులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వ భూములు పర్యవేక్షణ బాధ్యతలను గ్రామ పంచాయతీలకు అప్పగించి జిల్లా గెజిట్‌ విడుదల చేయాలని విన్నవించారు. ఆధార్‌ కార్డుల్లో అభ్యర్థుల ప్రమేయం లేకుండా మార్పులు, చేర్పులు చేస్తున్నారని, దీనివల్ల ఇబ్బందులు పడుతున్నామని పలువురు వ్యక్తిగత వినతులు అందజేశారు. ఆధార్‌ కేంద్రాల్లో పేరు, జనన తేదీ, అడ్రస్సు, వయసు తదితర మార్పులకు దరఖాస్తు చేస్తుంటే కార్డుల్లో పేర్లు మార్చే స్తున్నారని, ఒక్కో వ్యక్తి నాలుగైదు సార్లు తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాది హామీ పనులు చేపట్టి నెలలు దాటుతున్నా కూలీల ఖాతాలకు కూలి జమ కాలేదనిరణస్థలం, శ్రీకాకుళం మండలాలకు చెందిన కూలీలు వినతులు అందజేశారు. రూ.లక్షల పెట్టుబడి పెట్టి ఫైబరు నెట్‌ అనుమతులు పొందామని, గడచిన ఆరేళ్ల కాలంలో ఈ వ్యవస్థను నిర్వీర్యం చేయడం వల్ల కనెక్షన్లు తగ్గి ఆర్థికంగా నష్టపోతున్నామని ఎపి ఫైబర్‌ నెట్‌ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వీటితో పాటు వ్యక్తిగత, సామాజిక అవసరాలను పరిష్కరించాలని కోరుతూ పలువురు వినతులను అందజేశారు. కార్యక్రమంలో పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

➡️