భోగి మంటల్లో విద్యుత్‌ బిల్లులు

టిడిపి కూటమి

సోంపేట : భోగి మంటల్లో విద్యుత్‌ బిల్లులు వేసి నిరసన తెలుపుతున్న సిపిఎం నాయకులు

  • విద్యుత్‌ ఛార్జీల పెంపుపై సిపిఎం నిరసన
  • ట్రూఅప్‌ ఛార్జీల పేరుతో ప్రజలపై భారం
  • స్మార్ట్‌మీటర్లకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలి
  • సిపిఎం నాయకుల పిలుపు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

టిడిపి కూటమి ప్రభుత్వం ట్రూఅప్‌ ఛార్జీలు, స్మార్ట్‌ మీటర్ల పేరుతో ప్రజలపై మోపుతున్న భారాలకు వ్యతిరేకంగా సిపిఎం రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా జిల్లాలోని పలుచోట్ల భోగి మంటల్లో విద్యుత్‌ బిల్లులను దగ్ధం చేసి సోమవారం నిరసన తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని ఇందిరానగర్‌ కాలనీలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.మోహనరావు మాట్లాడుతూ విద్యుత్‌ భారాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రైతులు, ప్రజల పాలిట ఉరితాళ్ళుగా మారనున్న విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్ల బిగింపు ప్రక్రియను తక్షణమే నిలుపుదల చేయాలని, విద్యుత్‌ ఛార్జీల పెంపును రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ప్రభుత్వ కార్యాలయాల్లో ముందుగా ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు బిగించిందని… ప్రస్తుతం చిన్న, మధ్యతరగతి వ్యాపార సంస్థలతో సహా వినియోగదారులందరికీ స్మార్ట్‌ మీటర్లు అమరుస్తున్నారని చెప్పారు. నివాసాలకు, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోందన్నారు. వైసిపి ప్రభుత్వం పంపుసెట్లకు స్మార్ట్‌ మీటర్లు బిగించినపుడు ప్రతిపక్షంలో ఉన్న టిడిపి, జనసేన పార్టీలు వ్యతిరేకించాయని, మీటర్లు పగలగొట్టాలని పిలుపునిచ్చిన నాయకులే ఇప్పుడు అనుమతులు ఇస్తున్నారన్నారని విమర్శించారు. ప్రీపెయిడ్‌ స్మార్ట్‌మీటర్ల వల్ల ప్రజలపై పెద్దఎత్తున భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మీటర్ల వల్ల ముందుగానే డబ్బు చెల్లించి రీఛార్జి చేయించుకోవాలని, బ్యాలెన్స్‌ పూర్తి కాగానే విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుందని తెలిపారు. దీనివల్ల పేదలకు అంధకారం మిగులుతుందన్నారు. దీనికితోడు మీటర్ల భారాన్ని 96 నెలల పాటు వినియోగదారుడే చెల్లించాల్సి వస్తుందన్నారు. రాత్రి వేళల్లో అధిక వినియోగానికి అధిక ధరలు వసూలు చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి భయపడి నాడు వైసిపి, నేడు టిడిపి, జనసేన పార్టీలు ఈ మీటర్లను కొనసాగించడం అన్యాయమన్నారు. వెంటనే విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని, ట్రూఅప్‌ ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆర్‌.ప్రకాష్‌, ఎల్‌.మహేష్‌, శ్రీను, చిన్నారావు, పట్టణ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్‌ ఎం.గోవర్థనరావు, శంకర్‌, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.చలికాలంలో విద్యుత్‌ ధరలు పెంచి రాష్ట్ర ప్రభుత్వం చెమటలు పట్టిస్తోందని పలు ప్రజాసంఘాల నాయకులు విమర్శించారు, నగరంలోని కత్తెర వీధిలో నిర్వహించిన భోగి మంటల్లో విద్యుత్‌ బిల్లులను దహనం చేసి నిరసన చేట్టారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు కె.శ్రీనివాసు మాట్లాడుతూ ట్రూఅప్‌ ఛార్జీల పేరుతో 2014 నుంచి ప్రజల విద్యుత్‌ వాడకానికి బకాయిలు వసూలు చేయాలని డిస్కంలకు అనుమతిచ్చి, విద్యుత్‌ బాదుడుకు కూటమి ప్రభుత్వం పాల్పడుతోందని విమర్శించారు. మరోవైపు స్మార్ట్‌మీటర్లు, టైమ్‌ ఆఫ్‌ డే ధరలు, సుంకాలు, కస్టమర్‌ ఛార్జీల పేరుతో పలురూపాల్లో ప్రజలను దోపిడీ చేస్తోందన్నారు. లంచాలు మరిగిన నేతలు అవినీతికి పాల్పడి ఎక్కువ ధరలకు పిపిఎలు చేసుకొని కార్పొరేట్లకు లాభం చేకూరుస్తూ, వినియోగదారులకు భారం మోపే విధానాల్ని అనుసరిస్తున్నారని విమర్శించారు. అవినీతికర అదానీ, సెకీ ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు కార్యక్రమంలో పలు ప్రజాసంఘాల నాయకులు కె.నాగమణి, వి.జి.కె మూర్తి, పి.సుధాకర్‌, ఎస్‌.భాస్కరరావు, ఎ.సోమశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.పలాస : మండలంలోని మాకన్నపల్లిలో ప్రజలతో కలిసి భోగి మంటల్లో విద్యుత్‌ బిల్లులు దహనం చేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎన్‌.గణపతి, టి.అజరు కుమార్‌, టి.అప్పలస్వామి, టి.రాజు, జి.నీలకంఠం తదితరులు పాల్గొన్నారు.టెక్కలి రూరల్‌ : టెక్కలి పట్టణ కేంద్రంలోని ఎన్‌టిఆర్‌ కాలనీ, ఆదిఆంధ్రావీధిలో విద్యుత్‌ బిల్లులను దహనం చేసిన నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు నంబూరు షణ్ముఖరావు, ఉర్జాన దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.సోంపేట : మండలంలోని మామిడిపల్లిలో విద్యుత్‌ బిల్లుల దహన కార్యక్రమంలో సిపిఎం నాయకులు జుత్తు సింహాచలం, తెప్పల పాపారావు, గొరకల లింగరాజు తదితరులు పాల్గొన్నారు.ఆమదాలవలస : పట్టణంలోని పూజారిపేటలో భోగి మంటల్లో విద్యుత్‌ బిల్లులను దహనం చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి.మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

➡️