మందుల దుకాణాల ఏర్పాటుకు ప్రోత్సాహం

బి, డి-ఫార్మసీ

ఫార్మసీ అభ్యర్థులకు శుభవార్త

  • నేటి నుంచి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం
  • లబ్ధిదారుని వాటా లేకుండా యూనిట్‌కు రూ.8 లక్షలు
  • బిసి కార్పొరేషన్‌ ద్వారా దరఖాస్తుల స్వీకరణ

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

బి, డి-ఫార్మసీ కోర్సులు చేసి సొంతంగా మందుల దుకాణాలు ఏర్పాటు చేసుకుని జీవనోపాధి పొందేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది. ఇందులో భాగంగా బిసి, ఇడబ్ల్యుసి తరగతులకు ఈ దుకాణాలను మంజూరు చేయనున్నారు. బి, డి-ఫార్మసీ కోర్సులు చదివి నిరుద్యోగులుగా ఉన్న వారితో జనరిక్‌ ఔషధ దుకాణాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు విడుదల చేసింది. జిల్లాలోని బిసి, ఇడబ్ల్యుఎస్‌ తరగతుల యువతకు 63 యూనిట్లకు రూ.5.04 కోట్లు మంజూరు చేసింది. ఇందులో బిసిలకు 55 యూనిట్లు, ఇడబ్ల్యుఎస్‌ కోటాకు ఎనిమిది యూనిట్లు మంజూరు చేయనున్నారు. ఒక్కో యూనిట్‌కు రూ.2.52 కోట్లు బ్యాంకు రుణం కాగా, మిగిలిన మొత్తం రూ.2.52 కోట్లు రాయితీ లభిస్తుంది.నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణజిల్లాలో ఎంఎస్‌ఎంఇ శాఖ ద్వారా బిసి విభాగాల్లోని ఎ, బి, డి, ఇ తరగతులు, ఇడబ్ల్యుఎస్‌ (ఇబిసి, కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ) వారికి బిసి కార్పొరేషన్‌ ఈ యూనిట్లను మంజూరు చేయనుంది. ఇందుకు 21 నుంచి 60 ఏళ్ల లోపు వయసు, బి, డి-ఫార్మసీలో ఉత్తీర్ణత సాధించిన వారు ఈనెల తొమ్మిది నుంచి 16వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 17 నుంచి 19వ తేదీ వరకు మండలాల వారీగా మౌఖిక పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థులు బిపిఎల్‌ కుటుంబానికి చెంది ఉండాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతోపాటు ఆధార్‌ ఇతర ప్రభుత్వ గుర్తింపుకార్డులు ఉండాలని అందులో పేర్కొన్నారు. 2014-19 కాలంలో అప్పటి టిడిపి ప్రభుత్వ హయాంలో డిఆర్‌డిఎ-వెలుగు ఆధ్వర్యాన అన్న సంజీవని పేరుతో బి, డి-ఫార్మసీ కోర్సులు పూర్తి చేసిన స్వయం సహాయక సంఘాలకు చెందిన సభ్యులు, కుటుంబసభ్యులకు మందుల దుకాణాలను కేటాయించారు. అప్పట్లో జిల్లా కేంద్రంలో నాలుగు, మండల కేంద్రాల్లో ఒక్కొక్కటి మంజూరు చేశారు.అర్హులంతా దరఖాస్తు చేసుకోవచ్చుఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థులు సచివాలయాల్లో గానీ ఒబిఎంఎంఎస్‌ యాప్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తుల పరిశీలన అనంతరం బ్యాంకు ఆమోదం మేరకు వచ్చే నెల 27వ తేదీ నుంచి యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు వీలు కల్పించడమైంది. అర్హులైన ప్రతిఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలి. – గడ్డెమ్మ, ఇడి, బిసి కార్పొరేషన్‌

➡️