వినతిపత్రం అందజేస్తున్న రామ్మోహన్ నాయుడు
- రామ్మోహన్ నాయుడి అభ్యర్థనకు కేంద్రమంత్రి సానుకూల స్పందన
ప్రజాశక్తి – న్యూఢిల్లీ, శ్రీకాకుళం
జిల్లాలోని మత్స్యకారుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జల రవాణా శాఖల మంత్రి సర్బానంద సోనోవాల్ సానుకూలంగా స్పందించారు. సుమారు 193 కిలోమీటర్ల తీరప్రాంతం ఉన్న శ్రీకాకుళం జిల్లాలో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తమ ప్రాంతం నుంచి చాలామంది మత్స్యకారులు జీవనోపాధి కోసం గుజరాత్, కేరళ, కర్నాటక వంటి పశ్చిమ తీరప్రాంత రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తోందని మంత్రికి వివరించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం, సంతబొమ్మాళి మండలంలోని భావనపాడులో ఫిషింగ్ హార్బర్, వజ్రపుకొత్తూరు మండలంలోని మంచినీళ్లపేట, గార మండలంలోని కళింగపట్నంలో ఫిషింగ్ జెట్టీలను నిర్మించాలని మంత్రిని కోరారు. ఈ ప్రాజెక్టుల వల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడటమే కాకుండా, వలసలు తగ్గి తీరప్రాంత ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని వివరించారు. ఈ ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించిన మంత్రి సర్బానంద సోనోవాల్‌కి రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.