పోలిపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
మృత్యువులోనూ వీడని భార్యాభర్తల బంధం
ప్రాణాలు విడిచిన స్నేహితులు
శ్రీకాకుళంలో విషాదఛాయలు
విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి జాతీయ రహదారిపై శనివారం సంభవించిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం నగరానికి చెందిన నలుగు రు మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఇద్దరు దంపతులు కాగా, ఇద్దరు ప్రాణ స్నేహితులు, డ్రైవరు ఉన్నారు. ఈ ఘటన శ్రీకాకుళం నగరానికి చెందిన వ్యాపా ర కుటుంబాలతో పాటు విన్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళ్తే…
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
అప్పుడే తెలతెల్లవారుతోంది… తుపాను ప్రభావంతో చిరుజల్లులు కురుస్తున్నాయి. అయినా దైనందిన కార్యక్రమాల్లో భాగంగా తమ పనులను చక్కదిద్దుకునేందుకు ఇంటి నుంచి కారులో బయలు దేరారు ఆనలుగురు. సుమారు 80 కిలో మీటర్లు దూరం ప్రయాణించిన వారికి మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో ఆవహించింది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద సంభవించిన రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ వార్త విన్న అటు కుటుంబ సభ్యులతో పాటు సిక్కోలు ప్రజలను కలవరపరిచింది. ఈ ఘోరమైన ఘటనలో నగరానికి చెందిన బంగారం వ్యాపారి లంక గాంధీ అల్లుడు గయిడి కౌశిక్ (27), లియో లేబొరేటరీ అధినేత డాక్టర్ వడ్డి మన్మథరావు కుమారుడు వడ్డి అభినవ్, కోడలు మణిమాలతోపాటు డ్రైవర్ జయేష్ దుర్మరణం చెందారు. దీంతో మృతుల కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు.శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న కారు పోలిపల్లి అదుపు తప్పి అవతలి రోడ్డు వైపు దూసుకెళ్లి బోల్తాపడింది. ఆ సమయంలో అటుగా వస్తున్న లారీ ఢకొీనడంతో కారులో ఉన్న నలుగురూ అక్కడికక్కడే మృతి చెందారు. లారీ బలంగా ఢకొీనడంతో కారు నుజ్జునుజ్జయింది. మృతదేహాలు చెల్లా చెదుయ్యాయి. మృతి చెందిన గాయిడి కౌశిక్, వడ్డి అభినవ్‌లు చిన్న నాటి నుంచీ ప్రాణ స్నేహితులు. వీరి విద్యాభ్యాసం, వ్యాపారం అన్నింటా మనసు విప్ప మాట్లాడుకునేంత బంధం వీరిద్దరి. మృతుల్లో మరొకరు అభినవ్ భార్య మణిమాల బిటెక్ పూర్తి చేసింది. ఈమె బ్యాంకు ఉద్యోగాన్ని సాధించాలన్న పట్టదలతో పరీక్ష రాసేందుకు సిద్ధపడింది. భార్య పట్టదలను చూసి ఆమెను భర్త అభినవ్ ప్రోత్సహించేవాడు. ఇలా ఈ రెండు కుటుంబాల్లో చర్చించుకునే అంశమే ఈ ప్రయాణం. శుక్రవారం రాత్రి తన మేనమామను ఎయిర్ పోర్టు నుంచి రిసీవ్ చేసుకునేందుకు విశాఖ వెళ్తున్నట్లు కౌశిక్ చెప్పడంతో తన భార్య మణిమాల పరీక్ష గురించి చర్చించుకున్నారు. శనివారం తెల్లవారు జామున తన డ్రైవరు జయేష్‌ను కారుతో సిద్ధం కావాలని చెప్పిన కౌశిక్ చెప్పి బయలు దేరారు. అరగంట వ్యవధిలోనే రోడ్డు ప్రమాదంలో వీరంతా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఉన్న డ్రైవరు జయేష్ నిరుపేద కుటుంబానికి చెందిన వాడు. అతని తల్లి నగరంలో టీకొట్టు నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. తండ్రి చిన్నతనంలోనే కాలం చెల్లడంతో జయేష్ తన తల్లికి అండగా నిలిచేందుకు డ్రైవింగ్ వృత్తిలో ప్రావీణ్యం పొందాడు. అందులో బాగంగా కౌశిక్ వాహనాన్ని నడిపేందుకు వెళ్లాడు. ఆయన మృృతితో అతని తల్లి ఒంటరిదైంది. కౌసిక్ కుటుంబ నేపథ్యం బంగారం వ్యాపారమే. అతనికి ఇటీవలే వివాహమైంది. ఆ కుటుంబాల్లో ఇప్పుడు విషాదం నెలకొంది.