స్ట్రాంగ్‌రూముల్లో ఇవిఎంలు

పోలింగ్‌ ప్రక్రియ

స్ట్రాంగ్‌రూమ్‌కు వేస్తున్న సీల్‌

  • మూడంచెల భద్రత ఏర్పాటు

ప్రజాశక్తి – ఎచ్చెర్ల

పోలింగ్‌ ప్రక్రియ ముగియడంతో జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాలకు చెందిన ఇవిఎంలను భారీ పోలీసు బందోబస్తు మధ్య స్థానిక శివానీ ఇంజినీరింగ్‌ కళాశాలలో భద్రపరిచారు. జిల్లా ఎన్నికల పరిశీలకులు శేఖర్‌ విద్యార్థి, కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌, ఆయా నియోజకవర్గాలకు చెందిన రిటర్నింగ్‌ అధికారులు, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలో మంగళవారం ఉదయం వాటికి సీల్‌ వేశారు. మూడంచెల భద్రతా వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇవిఎంలు నిక్షిప్తం చేసిన స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీసు (ఐటిబిపి) కేంద్ర భద్రతా దళాలు పహారా కాయనుండగా, దాన్ని వెలుపుల వైపు రాష్ట్ర రిజర్వు పోలీస్‌ దళాలు బందోబస్తు నిర్వహిస్తున్నాయి. కళాశాల చుట్టుపక్కల మరో బృందం షిఫ్టుల వారీగా విధులు నిర్వహిస్తాయి. ఇలా మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. నిరంతరం సిసి కెమెరాల నిఘాతో పాటు రికార్డింగ్‌ కూడా చేస్తున్నారు. భద్రతా ఏర్పాట్లను ఎస్‌పి జి.ఆర్‌ రాధిక పరిశీలించి పలు అంశాలపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.ఓటింగ్‌ పక్రియ ముగియగానే సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సీల్‌ చేసిన ఇవిఎంలు, వివి ప్యాట్‌లు, జిపిఎస్‌ అనుసంధానం చేసిన ట్రాకింగ్‌ వాహనాలు చిలకపాలెం చేరుకున్నాయి. వాటిని అభ్యర్థుల సమక్షంలో లెక్కింపు కేంద్రమైన శివానీ ఇంజినీరింగ్‌ కళాశాలలోని స్ట్రాంగ్‌రూమ్‌లో చేర్చారు. మంగళవారం వాటికి సీల్‌ వేశారు. ఓట్ల లెక్కింపు జూన్‌ నాలుగో తేదీన జరుగనుంది. కౌంటింగ్‌ పూర్తయ్యే వరకు ఇవిఎంలు, వివిప్యాట్‌ల భద్రతపై ఏవైనా సందేహాలు ఉంటే తమను సంప్రదించవచ్చని జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌ తెలిపారు. కార్యక్రమంలో మరో ఎన్నికల పరిశీలకులు సందీప్‌ కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, టెక్కలి రిటర్నింగ్‌ అధికారి నూరుల్‌ కమర్‌, శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్‌ తమీమ్‌ అన్సారియా, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

➡️