సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కారం ఆలస్యమవుతున్నట్లు కనిపిస్తోందని, ఇదే ఒరవడి కొనసాగితే బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలోని జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌తో కలిసి అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీవెన్స్ నోడల్ ఆఫీసర్, రెవెన్యూ నోడల్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్లు సమన్వయంతో పనిచేసి, రైతుల సమస్యలను తొందరగా పరిష్కరించాలన్నారు. విఆర్‌ఒలు తమ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలకు రశీదులు ఇవ్వాలని, అర్జీలను ఆన్‌లైన్ చేయాలని సూచించారు. అర్జీదారుల ఫోన్ నంబర్లను సరిగ్గా నమోదు చేయాలని ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, అర్జీదారులకు ఫోన్ చేసి సమస్య పరిష్కారం గురించి తెలుసుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో ప్రత్యేక ఉప కలెక్టర్లు ఎం.అప్పారావు, బి.పద్మావతి, లావణ్య, ఆయా మండలాల తహశీల్దార్లు, ఉప తహశీల్దార్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.