వంద రోజుల పాలనలో వైఫల్యం

కూటమి ప్రభుత్వం

ధర్నా చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

  • కలెక్టరేట్‌ వద్ద కాంగ్రెస్‌ ధర్నా

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనలో వైఫల్యం చెందిందని డిసిసి అధ్యక్షులు అంబటి కృష్ణ విమర్శించారు. సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ వద్ద బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంద రోజుల పాలనలో రాస్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించామని కూటమి నాయకులు సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. సూపర్‌ సిక్స్‌ హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, పింఛను పెంపు తప్ప ఇంకే హామీ అమలు చేసిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, పేదల బతుకులు మరింత దుర్భరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి గాదం వెంకట త్రినాథ్‌ మాట్లాడుతూ రైతుభరోసా, అమ్మఒడి, నిరుద్యోగ భృతి, గ్యాస్‌ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర హామీలను ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. ఇసుక లభ్యం కాక భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అలవికాని హామీలిచ్చి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలను వంచించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ జరిగితే సిబిఐ విచారణను ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. ధర్నాలో కాంగ్రెసస్‌ నాయకులు ఈశ్వరి, ఆర్‌.సురేష్‌, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️