అసంపూర్తిగా ఉన్న ఆఫ్‌షోర్ రిజర్వాయర్ పనులు
ఆరు నెలలుగా నిలిచిన పనులు
రూ.20 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్
పనులను ఆపేసిన కాంట్రాక్టర్
స్పందించని ప్రభుత్వం
టెక్కలి, పలాస నియోజకవర్గాలకు సాగు, తాగునీరందించే ఆఫ్‌షోర్ ప్రాజెక్టు ప్రస్తుతం పడకేసింది. రిజర్వాయర్ పనులు ఆరు నెలలుగా నిలిచిపోయాయి. ప్రాజెక్టు పనులు చేపడుతున్న సంబంధిత నిర్మాణ సంస్థకు ప్రభుత్వం కోట్లాది రూపాయిలు బకాయి పడినట్లు తెలుస్తోంది. ఇదిగో, అదిగో చెల్లింపులు చేస్తామంటూ ప్రభుత్వం చెప్పినా ఒక్క పైసా విడుదల చేయలేదు. దీంతో కాంట్రాక్టర్ నిర్మాణ పనులను ఉన్నపళంగా ఆపేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 45 శాతమే పనులు పూర్తయ్యాయి. మరోవైపు నిర్వాసితుల పునరావసం, పరిహారం సమస్యలూ పెండింగ్‌లో ఉన్నాయి. అధికారులు మాత్రం వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసేస్తామంటూ చెప్తుండడంపై అందరిలోనూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి
టెక్కలి, నందిగాం, పలాస, మెళియాపుట్టి, మండలాల్లోని 24,600 ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2007లో ఆఫ్‌షోర్ రిజర్వాయర్ ప్రాజెక్టును ప్రారంభించింది. హైదరాబాద్‌కు చెందిన ఎస్.వి.ఇ.సి-ఇందు సంస్థతో రూ.123.25 కోట్లతో ఫిబ్రవరి 18, 2007లో ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం 2008 జనవరి నాటికి పనులు పూర్తి కావాల్సి ఉంది. భూసేకరణ పనులు సకాలంలో కాకపోవడం, ప్రభుత్వం పెద్దగా దృష్టిసారించకపోవడంతో 2014 వరకు పనులు ప్రారంభం కాలేదు. 2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం రిజర్వాయర్ పనులను మళ్లీ అదే సంస్థకు అప్పగించింది. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని సవరించి రూ.466.28 కోట్లకు పెంచింది. ప్రాజెక్టు పనుల పూర్తికి జూలై 7, 2019 వరకు గడువిచ్చింది. టిడిపి ప్రభుత్వం అధికారం కోల్పోయిన నాటికి 38 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి.ఐదేళ్ల్లలో ఏడు శాతమే పనులువైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పాత నిర్మాణ సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. మిగిలిన పనులకు సంబంధించి కొత్త రేట్లతో రూ.855 కోట్ల అంచనా వ్యయంతో 2021 సెప్టెంబర్‌లో అధికారులు ప్రతిపాదనలు పంపగా 2022 సెప్టెంబర్‌లో సవరించిన అంచనాల మేరకు రూ.852.45 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటివరకు 45 శాతం పనులు మాత్రమే జరిగాయి. అంటే నాలుగున్నరేళ్లలో ఏడు శాతమే పనులు జరిగాయి.పనులు 45 శాతమేరిజర్వాయర్ పనులు ప్రస్తుతం 45 శాతం మేర జరిగాయి. మట్టి పనులు 83,31,000 క్యూబిక్ మీటర్ల పని చేపట్టాల్సి ఉండగా, 42,36,527 క్యూబిక్ మీటర్ల పని పూర్తయింది. ఇంకా 40,94,473 క్యూబిక్ మీటర్ల పని మిగిలి ఉంది. కాంక్రీట్ పనులు 1,31,544 క్యూబిక్ మీటర్ల పని జరగాల్సి ఉండగా ఇప్పటివరకు 2,457 క్యూబిక్ మీటర్ల పని పూర్తయింది. మరో 1,29,087 క్యూబిక్ మీటర్ల పని పెండింగ్‌లో ఉంది.పనులు 45 శాతం… ఖర్చు 70 శాతంరిజర్వాయర్ పనులు ఇప్పటివరకు 38 శాతం మాత్రమే పూర్తయ్యాయి. ఖర్చుల విషయంలో మాత్రం గత టిడిపి ప్రభుత్వం ఎక్కడా తగ్గలేదు. రిజర్వాయర్ నిర్మాణ అంచనా వ్యయాన్ని రూ.123.25 కోట్ల నుంచి రూ.466.28 కోట్లకు పెంచిన విషయం తెలిసిందే. అందులో రూ.325.45 కోట్లను వెచ్చింది. అంటే 70 శాతం మేర ఖర్చు చేసింది.అపరిష్కృతంగా నిర్వాసితుల సమస్యలుఆఫ్‌షోర్ ప్రాజెక్టు పనులు ప్రారంభమై 17 ఏళ్లు కావస్తున్నా, నిర్వాసితుల సమస్యలు నేటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి. ఆఫ్‌షోర్ రిజర్వాయర్ నిర్మాణంతో 1059 కుటుంబాలు నిర్వాసితులు కాగా, అందులో ఇప్పటివరకు 659 కుటుంబాలకే పునరావాసం కల్పించారు. కొన్నిచోట్ల పరిహారం చెల్లింపులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని క్లియర్ చేస్తే గానీ పనులు ముందుకు సాగే పరిస్థితి లేదు.రూ.20 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌ఆఫ్‌షోర్ ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తి కాకపోవడానికి ప్రభుత్వ ఉదాసీనమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పనులు చేస్తున్న ఎస్.వి.ఇ.సి-ఇందు సంస్థకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోవడానికి దారితీసింది. సంబంధిత నిర్మాణ సంస్థకు ప్రభుత్వం రూ.20.34 కోట్లు చెల్లించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. బకాయిలపై ప్రభుత్వానికి పలుమార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో, సంబంధిత కాంట్రాక్టర్ ఉన్నపళంగా పనులను ఆపేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.ప్రజాప్రతినిధులు స్పందించేనా?ఆఫ్‌షోర్ ప్రాజెక్టు పూర్తయితే టెక్కలి, పలాస నియోజకవర్గాల పరిధిలోని ప్రజలకు మేలు కలగనుంది. నిర్మాణ పనులను పట్టాలెక్కించాలంటే ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష జోక్యం చేసుకుంటేనే సాధ్యపడుతుంది. వంశధార కాలువల్లో పూడిక తొలగింపునకు కొంత చొరవ చూపినా జిల్లాలో ముఖ్యమైన ప్రాజెక్టు అయిన ఆఫ్‌షోర్‌పై ఇప్పటివరకు స్పందించలేదు. ప్రాజెక్టు నిర్మాణ పనులపై సమీక్ష చేపట్టడం గానీ, ఆ ప్రాంతాన్ని సందర్శించి పనులు పరిశీలించడం గానీ చేయలేదు. ఇప్పటికైనా ఇరువురు ప్రజాప్రతినిధులు స్పందిస్తేనే ఆఫ్‌షోర్ త్వరితగతిన పూర్తయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.