అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ప్రజాశక్తి – కంచిలి : అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం… మండలంలోని పెద్ద కొజ్జిరియాకు చెందిన రైతు బల్లెడ నరసింహమూర్తి (58) తనకున్న ఎకరా పొలంతో పాటు మరో ఏడెకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. జీడి, మామిడి పంటల పెట్టుబడి కోసం నాలుగేళ్లుగా ప్రయివేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేశారు. ఆ అప్పు వడ్డీతో కలిసి రూ.15 లక్షలు అయ్యింది. ఓ వైపు రుణదాతల ఒత్తిడి.. మరోవైపు నాలుగేళ్లుగా ఆశించిన మేర దిగుబడి రాకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. బుధవారం ఉదయం తోటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన నరసింహమూర్తి రాత్రి ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు తోటకు వెళ్లి వెతికారు. గ్రామ సమీపంలోని ఒక జీడి చెట్టు కింద విగతజీవిగా పడి ఉన్న నరసింహమూర్తిని గమనించారు. పక్కనే పురుగుల మందు డబ్బా కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు సోంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పారినాయుడు తెలిపారు. నరసింహమూర్తికి భార్య నీలవేణి, కుమారులు శ్రీను, ప్రవీణ్‌ ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

➡️