సత్కారాన్ని అందుకుంటున్న శ్రీధర్
వ్యవసాయశాఖ జెడి కె.శ్రీధర్
శ్రీకాకుళం అర్బన్:
వ్యవసాయశాఖలో పనిచేయడం ద్వారా రైతులకు సేవ చేసే అవకాశం లభించిందని ఆ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్ అన్నారు. జిల్లాలో పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేయడం ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చిందని చెప్పారు. నగరంలోని ఒక హోటల్‌లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఆయన ఉద్యోగ విరమణ వీడ్కోలు సభను ఆదివారం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన 34 ఏళ్ల సర్వీసులో పనిచేసిన అన్నిచోట్లా ఎంతోమంది ఆప్తులను పోగు చేసుకోగలిగానన్నారు. ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడంలో తనకు వెన్నుదన్నుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వాటర్‌షెడ్‌లో మంచి కార్యక్రమాలు చేయడం, గిరిజనులతో మమేకమై ఐటిడిఎలో పనిచేయడం, ఔత్సాహిక రైతులతో అనేక రాష్ట్రాలు తిరగడం, వ్యవసాయంలో కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం ఇవన్నీ మంచి అనుభూతులను మిగిల్చాయన్నారు. ఈ సందర్భంగా ఆయన పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో పనిచేసిన విషయాలను పంచుకున్నారు. తన భార్య, కుటుంబసభ్యుల సహకారం మరువలేనివని చెప్పారు. వ్యవసాయ, అనుబంధ శాఖల ఉద్యోగులు ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఉద్యోగ విరమణ అనంతరం శేష జీవితం సంతోషకరంగా ఉండాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్లు రామరాజు, వేణుగోపాల్, వ్యవసాయ పరిశోధనా శాస్త్రవేత్త సత్యనారాయణ, హార్టికల్చర్, సెరీకల్చర్ ఎడిలు, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు, ఉపసంచాలకులు పాల్గొన్నారు.