ఫీ’జులుం’

Jun 9,2024 22:57 #ఫీ'జులుం'
తిమ్మిని బమ్మి, బమ్మిని
  • వేళ్లూనుకుంటున్న విద్యా వ్యాపారం
  • ఇష్టారాజ్యంగా ఫీజుల వసూలు

కార్పొరేట్‌ విద్య… అత్యుత్తమ విద్య… నాణ్యమైన విద్య… పేరేదైనా అంతిమ లక్ష్యం విద్యా వ్యాపారమే. జిల్లాలో ఇప్పుడు అక్షరాలా అదే జరుగుతోంది. పలు రకాల పేర్లతో విద్యా వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వేళ్లూనుకుంటోంది. గతంలో జిల్లా కేంద్రానికే పరిమితమైన పలు కార్పొరేట్‌ పాఠశాలలు నేడు మండల కేంద్రాలకూ విస్తరించాయి. ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాలకూ సరితూగని కొన్ని పాఠశాలలూ అనధికారికంగా టెక్నో, ఇ-టెక్నో, కాన్సెప్ట్‌, ఐఐటి తదితర పేర్లతో ఫీజుల వసూళ్లలో మాత్రం ముందుంటున్నాయి. కార్పొరేట్‌, ప్రయివేటు విద్యాసంస్థల ఫీజుల వసూళ్లకు అడ్డుకట్ట వేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జిఒలేవీ అమలుకు నోచుకోవడం లేదు.

ప్రజాశక్తి – శ్రీకాకుళం, ఇచ్ఛాపురం

తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మి చేయడంలో కార్పొరేట్‌, కొన్ని ప్రయివేటు విద్యాసంస్థలు ఆరితేరాయి. ఆయా పాఠశాలల్లో సాధిస్తున్న ఫలితాల మాట ఎలా ఉన్నా కరపత్రాలు, బ్రోచర్లు, ప్రకటనల ద్వారా వారు చేస్తున్న ప్రచార పటోపానికి విద్యావంతులైన తల్లిదండ్రులూ మోసపోతున్నారంటే, ఆ ప్రచారం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రచార భ్రమలో పడి ప్రభుత్వ పాఠశాలల్లో సాధిస్తున్న ఫలితాలను పక్కన పడేసి, కార్పొరేట్‌ పాఠశాలల వైపు తాహతుకు మించి పరుగులు తీస్తున్నారు. ఈ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న విద్యార్థుల సంఖ్యను పరిశీలిస్తే తక్కువే. మెరుగైన ఫలితాలు సాధించని విద్యార్థులే ఎక్కువగా ఉంటారు. ఉత్తమ ఫలితాలు సాధించిన అరకొర విద్యార్థులనే ఆయా పాఠశాలలు ప్రచారాలకు వాడుకుంటున్నాయి. ఈ హంగూ, ఆర్భాటాలను ఏమాత్రం పట్టించుకోని తల్లిదండ్రులు ఈ విద్యాసంస్థల మోజులో పడి జేబులు ఖాళీ చేయించుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని అర్హతలు, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు విద్యను బోధిస్తూ, ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేస్తున్నారు. ఇవే అర్హతలు కార్పొరేట్‌ పాఠశాలల్లో పరిశీలిస్తే ఎక్కడో తప్ప మచ్చుకైనా కనిపించవు.ఇష్టారాజ్యం జూన్‌ 12వ తేదీ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. కార్పొరేట్‌, ప్రయివేటు విద్యాసంస్థలు అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించాయి. విద్యార్థుల వేట కోసం మండుటెండలోనూ గడప గడపా తొక్కుతున్నాయి. వేసవి సెలవుల్లో అడ్మిషన్లు చేపట్టరాదని నిబంధనలున్నా, ఎవరూ పట్టించుకోలేదు. వీటికితోడు ఆ విద్యాసంస్థలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రయివేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు 2012 జూలై 30వ తేదీన ప్రభుత్వం జిఒ నంబరు 42ను జారీ చేసింది. దీని ప్రకారం ఆయా విద్యాసంస్థలు కల్పించే సౌకర్యాలను బట్టి అర్బన్‌ పరిధిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యకు విద్యార్థుల నుంచి నెలకు రూ.750, ఏడాదికి రూ.తొమ్మిది వేల లోపు వసూలు చేయాలి. రూరల్‌ పరిధిలో నెలకు రూ.650, ఏడాదికి రూ.7,800లోపు వసూలు చేయాలి. హైస్కూల్‌ విద్యకు అర్బన్‌ పరిధిలో నెలకు రూ.వెయ్యి, ఏడాదికి రూ.12వేల లోపు వసూలు చేయాలి. రూరల్‌ పరిధిలో నెలకు రూ.900, ఏడాదికి రూ.10,800 లోపు వసూలు చేయాలి. ఈ నిబంధనలు మచ్చుకైనా కనిపించడం లేదు. అమలుకు నోచని జిఒలు జిల్లాలో సుమారు 3.50 లక్షల మంది విద్యార్థులు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకూ విద్య నభ్యసిస్తున్నారు. జిల్లాలో సుమారు 450 వరకు కార్పొరేట్‌, ప్రయివేటు పాఠశాలలు ఉంటే, సుమారు 80 వరకు గుర్తింపు లేని పాఠశాలలు ఉన్నాయి. కొన్ని పాఠశాలలు ఐదో తరగతి వరకు అనుమతులుంటే, ఏడో తరగతి వరకు బోధిస్తున్నాయి. మరికొన్ని పాఠశాలలు ఏడో తరగతి వరకు అనుమతులుంటే, పదో తరగతి వరకు బోధిస్తున్నాయి. ఇలాంటి విద్యాసంస్థల్లోనూ ఫీజులు చుక్కలు చూపిస్తున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రవేశ పరీక్షలు, అడ్మిషన్ల పేరుతో వసూలు చేస్తున్న ఫీజులే కాక బస్సు, దుస్తులు, బూట్లు, పుస్తకాలు… ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా చాంతాడంత ఉంటుంది. వీటి కోసం వేలకు వేల రూపాయలు తల్లిదండ్రుల నుంచి అప్పనంగా గుంజుతున్నారు.కొరడా ఝుళిపిస్తారా..? కార్పొరేట్‌ పాఠశాలల పరిస్థితి అయితే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. ఏడో తరగతికే ఏడాదికి సుమారు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకూ వసూలు చేస్తున్నాయి. ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మాత్రం కనిష్ట స్థాయిలో జీతాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాయి. కుటుంబ పోషణకే జీతాలు చాలడం లేదని, పెంచాలని ఉపాధ్యాయులు ఒత్తిడి తెస్తే, వారిని తొలగించిన సందర్భాలు కోకొల్లలు. దీంతో మిగిలిన వారు నోరెత్తలేక ఇచ్చిందే మహా ప్రసాదంగా సరిపెట్టుకొని మిన్నకుంటున్నారు. నిబంధనలు పాటించని ప్రయివేటు పాఠశాలలను మూసివేసే ప్రయత్నం ప్రభుత్వం చేయడం లేదు. ఈ విద్యా సంవత్సరంలోనైనా ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని, ఫీ’జులుం’పై విద్యాశాఖాధికారులు కొరడా ఝుళిపించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఆ దిశగా అధికార యంత్రాంగం కదులుతుందో, లేదో ఆచరణలో చూడాల్సి ఉంది.

➡️