గడ్డెయ్య మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు
ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి
గార మండలం బందరువానిపేటలో సముద్రంలో పడవ బోల్తా పడిన ఘటనలో అదే గ్రామానికి చెందిన కుంది గడ్డెయ్య (41) గురువారం మృతి చెందాడు. చేపల వేటకు వెళ్లేందుకు సాయంత్రం బయలుదేరిన గడ్డెయ్య అలల తాకిడికి పడవ బోల్తా పడడంతో సముద్రంలో మునిగిపోయాడు. ఆయనకు భార్య తోటమ్మ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఒడ్డుకు కొట్టుకొచ్చిన మృతదేహాన్ని చూసి కుంటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మత్స్యకారుడు మృతిపై రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై మత్స్యశాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సముద్రంలో చేపల వేట సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మత్స్యకారులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీనిచ్చారు.