బలవంతపు రిటైర్మెంట్‌ ఆపాలి

శ్యామ్‌క్రగ్‌ పిస్టన్స్‌ అండ్‌

కార్మికశాఖ మంత్రికి శ్యామ్‌పిస్టన్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ వినతి

ప్రజాశక్తి – రణస్థలం

శ్యామ్‌క్రగ్‌ పిస్టన్స్‌ అండ్‌ రింగ్స్‌ ప్లాంట్‌-2 పరిశ్రమలో 30 ఏళ్ల సర్వీసు పేరుతో యాజమాన్యం చేస్తున్న బలవంతపు రిటైర్మెంట్‌ ఆపాలని, ఇలా అక్రమంగా తొలగించిన కార్మికులందరినీ వెంటనే విధుల్లోకి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ను శ్యామ్‌క్రగ్‌ పిస్టన్స్‌ (రింగ్స్‌) వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు కోరారు. రామచంద్రాపురంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి శ్యామ్‌క్రగ్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి గొర్లె కిరణ్‌, ఆర్‌.ఎస్‌ నాయుడు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టాండింగ్‌ ఆర్డర్‌ పేరుతో 30 ఏళ్లు సర్వీస్‌ పూర్తయిందని అర్ధాంతరంగా కార్మికులను యాజమాన్యం ఉద్యోగాల నుంచి తొలగించి రోడ్డున పెడుతోందన్నారు. కంపెనీ స్టాండింగ్‌ ఆర్డర్‌ ఉన్నట్లు కార్మికులకు, యూనియన్‌కు తెలీదని చెప్పారు. ఎక్కడా లేని విధంగా ఐదు నుంచి పదేళ్ల సర్వీసు ఉన్నా, ఇప్పటివరకు 90 మంది కార్మికులను యాజమాన్యం అక్రమంగా తొలగించడంతో వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం అన్‌ ఫెయిర్‌ లేబర్‌ ప్రాక్టీస్‌కు పాల్పడుతోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కార్మికుల అక్రమ తొలగింపు ఆపి కార్మికులకు ఉపాధి భద్రత కల్పించాలన్నారు. అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకునేలా చర్యలు తీసుకుని కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. మోడల్‌ స్టాండింగ్‌ ఆర్డర్స్‌ ప్రకారం రిటైర్మెంట్‌ వయసు వరకు కార్మికులను విధుల్లో కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం జాయింట్‌ కమిషన్‌ ఆఫ్‌ లేబర్‌ (జెసిఎల్‌) లేకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో కార్మికుల సమస్యలపై సంయుక్త సమావేశాలు వేయకపోవడం వల్ల కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదని చెప్పారు. వెంటనే విశాఖలో జెసిఎల్‌ను నియమించాలని కోరారు.

➡️