ప్రజాశక్తి – రణస్థలం : శ్యాంక్రగ్ పిస్టన్స్ అండ్ రింగ్స్ ప్లాంట్-2 పరిశ్రమలో 30 సంవత్సరాలు సర్వీస్ పేరుతో యాజమాన్యం చేస్తున్న బలవంతపు రిటైర్మెంట్ ఆపాలని, 30 సంవత్సరాలు సర్వీసు పూర్తయిందని అక్రమంగా తొలగించిన కార్మికులందరినీ వెంటనే విధుల్లోకి తీసుకునేలా తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ను శ్యాంక్రగ్ పిస్టన్స్ (రింగ్స్) వర్కర్స్ యూనియన్ (సిఐటియు) నాయకులు కోరారు. రామచంద్రాపురంలో ఆయన క్యాంపు కార్యాలయంలో శ్యాంక్రగ్ పిస్టన్స్ (రింగ్స్) వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి గొర్లె కిరణ్, ఆర్.ఎస్.నాయుడు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టాండింగ్ ఆర్డర్ పేరుతో 30 సంవత్సరాలు సర్వీసు పూర్తయిందని అర్ధాంతరంగా కార్మికులను యాజమాన్యం ఉద్యోగాలు నుండి తొలగించి రోడ్డున పెడుతుందని అన్నారు. కంపెనీ స్టాండింగ్ ఆర్డర్ ఉన్నట్లు కార్మికులకు, యూనియన్ కు తెలీదని చెప్పారు. ఎక్కడా లేని విధంగా 5 నుండి 10 సంవత్సరాలు సర్వీసు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు 90 మంది కార్మికులను యాజమాన్యం అక్రమంగా తొలగించడంతో వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. యాజమాన్యం అన్ ఫెయిర్ లేబర్ ప్రాక్టీస్ కు పాల్పడుతోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కార్మికుల అక్రమ తొలగింపు ఆపి కార్మికులకు ఉపాధి భద్రత కల్పించాలని, అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకునేలా తగు చర్యలు తీసుకుని కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. మోడల్ స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం రిటైర్మెంట్ వయసు వరకు కార్మికులను విధుల్లో కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విశాఖపట్నం జాయింట్ కమీషన్ ఆఫ్ లేబర్ లేకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఉత్తరాంధ్ర ఆరు జిల్లాలో కార్మికుల సమస్యలపై సంయుక్త సమావేశాలు వేయకపోవడం వలన కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదని అన్నారు. వెంటనే విశాఖపట్నంలో జాయింట్ కమీషనర్ ఆఫ్ లేబర్ ను నియమించాలని కోరారు.