గట…గటా

Jan 16,2025 21:38 #గట గటా...
జిల్లాలో సంక్రాంతి
  • పండగ వేళ తెగ తాగిన మద్యం ప్రియులు
  • నాలుగు రోజుల్లో రూ.29.21 కోట్ల ఆదాయం

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

జిల్లాలో సంక్రాంతి పండగ వేళ మద్యం ఏరులై పారింది. పండగ రోజుల్లో అధిక మొత్తంలో మద్యం అమ్మకాలు సాగాయి. మద్యం దుకాణాలకు సంక్రాంతి, కనుమ సెలవు రోజులు కావడంతో భోగి పండగ ముందు రోజే నుంచే మద్యం దుకాణాలు కళకళలాడాయి. మద్యం విక్రయాలతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. బెల్టు షాపులు లేవని అధికారులు, ప్రభుత్వం నమ్మబలుకుతున్నా, అధికంగా అమ్మకాలు సాగడం వెనుక వాటి పాత్రే ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.జిల్లావ్యాప్తంగా 158 మద్యం షాపులు, 17 బార్‌ అండ్‌ రెస్టారెంట్లు ఉన్నాయి. ఎప్పటి మాదిరిగానే కొత్త సంవత్సరం వేడుకల పేరుతో మందుబాబులు తెగ తాగారు. గతేడాది పండగ రోజుల్లో మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. ఈ ఏడాది అందుకు భిన్నంగా అమ్మకాలు సాగాయి. భోగి ముందు రోజు నుంచే అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. భోగి రోజు గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా ఆదాయం వచ్చింది. ఆ రోజున రూ.11.20 కోట్ల అమ్మకాలు సాగాయి. 12వ తేదీన రూ.5.51 కోట్ల అమ్మకాలు సాగాయి. 11వ తేదీన రూ.6.21 కోట్ల ఆదాయం సమకూరింది. పదో తేదీన రూ.6.29 కోట్ల మేర అమ్మకాలు సాగాయి. గతేడాది కనుమ రోజు అత్యధికంగా అమ్మకాలు సాగాయి. ఆ రోజున రూ.9.22 కోట్ల ఆదాయం వచ్చింది. సంక్రాంతి రోజైన 15న రూ.8.92 కోట్ల అమ్మకాలు సాగాయి. భోగి రోజు రూ.ఆరు కోట్ల ఆదాయం వచ్చింది.మద్యం అమ్మకాల వివరాలు ఇలా…పండగ నేపథ్యంలో ఎప్పటి మాదిరిగానే లిక్కర్‌ కేసులే అధికంగా అమ్ముడైపోయాయి. ఈనెల పదో తేదీన 8,766 ఐఎంఎల్‌ కేసులు, 3,028 బీరు కేసులు విక్రయాలు సాగాయి. 11న తొమ్మిది వేల ఐఎంఎల్‌ కేసులు, 2,439 బీరు కేసులు అమ్ముడుపోయాయి. 12న 8,292 ఐఎంఎల్‌ కేసులు, 1649 బీరు కేసులు అమ్మకాలు సాగాయి. 13వ తేదీన 15,461 ఐఎంఎల్‌ కేసులు, 5 వేల బీరు కేసుల విక్రయాలు సాగాయి.

➡️