వైభవంగా కొత్తమ్మతల్లి ఉత్సవాలు

మూడు రోజుల పాటు నిర్వహించే

పట్టువస్త్రాలను సమర్పిస్తున్న రామ్మోహన్‌నాయుడు

ప్రజాశక్తి – కోటబొమ్మాళి

మూడు రోజుల పాటు నిర్వహించే కొత్తమ్మతల్లి ఉత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను కేంద్ర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్‌పి కె.వి మహేశ్వర రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ఆలయ మేనేజర్‌ వాకచర్ల రాధాకృష్ణ, పురోహితులు సుసరాపు గణపతిశర్మ, లకీëకాంతంశర్మ, అరసవల్లి ఆలయ పురోహితులు పూర్ణకుంభంతో ఆలయంలోకి స్వాగతం పలికారు. కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో అంబికా దర్బారు సంస్థ ఏర్పాటు చేసిన ఐదడుగుల అగరబత్తిని ప్రారంభించారు. కొత్తమ్మతల్లి ఆలయం నుంచి మెయిన్‌ రోడ్డు మీదుగా మంత్రులు నడుచుకుంటూ మెయిన్‌ రోడ్డుపై ఏర్పాటు చేసిన దుర్గా విగ్రహాన్ని దర్శనం చేసుకున్నారు. ఆర్‌టిసి కాంప్లెక్స్‌ వద్ద గల కోటదుర్గమ్మ తల్లినీ దర్శించుకున్నారు. ఎమ్మెల్యేలు బగ్గు లక్ష్మణరావు, గొండు శంకర్‌ పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. జిల్లా నలుమూలల నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచీ యాత్రికులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలో ఉన్న అమ్మవారి జంగిడిని అసాదీల కుటుంబీకుల పెద్ద తలపై పెట్టుకొని తల్లికి నిలయమైన రెడ్డిక వీధికి చెందిన కమ్మకట్టు చిన్నఅప్పలనాయుడు ఇంటి వరకు మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువెళ్లారు. జంగిడిని గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు రెడ్డిక వీధి నుంచి కలశాలతో ఊరేగింపుగా కొత్తమ్మతల్లి ఆలయానికి తీసుకొస్తారు. కొత్తమ్మతల్లి ఉత్సవాల సందర్భంగా కోటబొమ్మాళి మెయిన్‌రోడ్డు పక్కన సైకత శిల్పి గేదెల హరికృష్ణ వేసిన అమ్మవారి సైకత శిల్పం చూపరులను ఆకట్టుకుంది. కొత్తమ్మతల్లి ఉత్సవాల్లో అన్నదాన కార్యక్రమానికి వ్యాపారవేత్త అంధవరపు సంతోష్‌ కుమార్‌, బోయిన గోవిందరాజులు మంత్రులు రామ్మోహన్‌ నాయుడు, అచ్చెన్నాయుడుకు రూ.లక్ష విరాళంగా రూ.లక్ష చెక్కును అందజేశారు.

➡️