బంగారం దొంగలు దొరికారు

గార, లావేరు ప్రాంతాల్లో

వివరాలను వెల్లడిస్తున్న ఎస్‌పి మహేశ్వర రెడ్డి

  • గార, లావేరులో నిందితుల పట్టివేతసొత్తు రికవరీ

 * ఎస్‌పి మహేశ్వర రెడ్డి

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

గార, లావేరు ప్రాంతాల్లో చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి నుంచి బంగారం, నగదును రికవరీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్‌పి కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఎస్‌పి కె.వి మహేశ్వర రెడ్డి వెల్లడించారు. గార మండలం జోగిపంతులపేటలో నివాసముంటున్న పిట్టా రమణ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈనెల 29న గుర్తు తెలియని దొంగలు పడి ఇంట్లోని పావుతులం పరిమాణం గల మూడు బంగారం ముక్కలు, పావుతులం చెవి దిద్దులు, మొత్తం తులం బంగారం చోరీకి గురైనట్లు బాధితుడు గార పోలీస్‌స్టేషన్‌లో అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు ఫిర్యాదు చేశాడు. దీనిపై శ్రీకాకుళం రూరల్‌ సిఐ, సిసిఎస్‌ ప్రత్యేక బృందంగా ఏర్పడి గార మండలం బూరవల్లి కూడలి వద్ద మాటు వేశారు. గార వైపు నుంచి వస్తున్న ఆటో నుంచి శ్రీకాకుళం మండలం అలికాం కాలనీకి చెందిన నాగరాజు పోలీసు సిబ్బందిని చూసి తడబడుతూ పారిపోయేందుకు ప్రయత్నించాడు. అనుమానంతో పోలీసులు అతన్ని పట్టుకుని ప్రశ్నించారు. చింతాడ, బుడుమూరు, నేరేడు సంతల్లో పశువులను అమ్మి వచ్చిన కమీషన్‌తో జీవనం సాగిస్తున్నట్లు వివరించాడు. వ్యాపారం సరిగా లేక చెడు వ్యసనాలకు బానిసై అప్పులు చేసి వాటిని తీర్చలేక దొంగతనాలు చేస్తున్నట్లు చెప్పాడు. జోగిపంతులపేటలో ఎవరూ లేని ఇంట్లో ఉదయం 11 గంటల సమయంలో తాళాలు విరగొట్టి ఇంట్లోని బంగారం దొంగిలించినట్లు అంగీకరించాడు. గ్రామ శివారులోని ఓ తోటలో చీకటి పడేంత వరకు ఉండి ఇంటికి వెళ్తుండగా పట్టుబడ్డానని చెప్పాడు. గతేడాది నవంబరు 25న లింగాలవలసలో తులం ముప్పావు, దువ్వుపేటలో డిసెంబర్‌ 27న నాలుగున్నర తులాలు దొంతతనానికి పాల్పడినట్లు చెప్పాడు. అందులో తులంపావు బంగారాన్ని ఎపిజివిబి అలికాం బ్రాంచిలో కుదవ పెట్టి డబ్బులు వాడుకున్నట్లు వివరించాడు. నిందితుడి ఇంటికి వెళ్లి దొంగిలించిన 85 గ్రాముల బంగారం, కేజీ వెండి వస్తువులను రికవరీ చేశారు. లావేరు మండలం బెజ్జిపురానికి చెందిన తాళాబత్తుల సూరిబాబు మే 27న తన కుటుంబంతో కలిసి ఎస్‌.కోట వెళ్లి 29న ఇంటికి వచ్చేసరికి ఇంటి తలుపులు తీసి ఉన్నాయి. బీరువా తెరిచి చూడగా అందులో పదహారున్నర తులాల బంగారం వస్తువులు, రూ.17వేల నగదు చోరీకి గురైనట్లు లావేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జెఆర్‌ పురం సిఐ ఎం.అవతారం ఆధ్యర్యాన పోలీసు సిబ్బందితో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టారు. బాధితుడు సూరిబాబు ఇంటి సమీపంలో వడ్రంగి పనిచేస్తున్న జవ్వాది ప్రసాద్‌పై పోలీసు నిఘా పెట్టారు. సూరిబాబు ఇంటి వద్ద సేకరించిన వేలిముద్రలు, ప్రసాద్‌ వేలిముద్రలతో సరిపోలడంతో నిందితుడిని పోలీసులు విచారించారు. చెడు వ్యసనాలకు లోనై అప్పులు చేశానని, అప్పు ఇచ్చిన వాళ్లు ఒత్తిడి చేస్తుండడంతో సూరిబాబు ఇంట్లో బంగారం దొంగిలించినట్లు అంగీకరించాడు.పోలీసులను అభినందించిన ఎస్‌పిగార, లావేరులో దొంగతనం కేసులను ఛేదించిన శ్రీకాకుళం డిఎస్‌పి సిహెచ్‌.వివేకానంద పర్యవేక్షణలో పనిచేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్‌పి మహేశ్వరరెడ్డి అభినందించారు. శ్రీకాకుళం రూరల్‌, జెఆర్‌పురం సిఐలు పైడిపునాయుడు, ఎం.అవతారం, లావేరు, గార ఎస్‌ఐలు లక్ష్మణరావు, జనార్థనరావు, క్లూస్‌ టీమ్‌ ఎస్‌ఐ భరత్‌, హెడ్‌ కానిస్టేబుల్స్‌ కిరణ్‌సింగ్‌, ఎం.విజయానంద్‌, కానిస్టేబుళ్లు కె.లక్ష్మణరావు, జగదీష్‌, బాలకృష్ణను ప్రశంసించారు.

➡️