నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలి

మండలంలోని మెట్టూరులో ఉన్న అయ్యప్ప ట్రేడర్స్‌ విత్తనాల షాపును

రికార్డులను పరిశీలిస్తున్న ఎఒ శ్రీనివాసరావు

ప్రజాశక్తి- కొత్తూరు

మండలంలోని మెట్టూరులో ఉన్న అయ్యప్ప ట్రేడర్స్‌ విత్తనాల షాపును మండల ఎఒ ఎన్‌.శ్రీనివాసరావు శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వరి విత్తనాల నమూనాలు సేకరించారు. దీనిని తిరుపతిలో ఉన్న ప్రాంతీయ కోడింగ్‌ కేంద్రానికి పంపించారు. ఈ సందర్భంగా రైతులకు నాణ్యమైన వరి విత్తనాలు ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించడానికి ఏర్పాట్లు చేస్తోందన్నారు. నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఈయన వెంట వ్యవసాయ విస్తారణాధికారి బూడిద రమేష్‌ ఉన్నారు. రైతులు పేర్లు నమోదు చేసుకోవాలిమండలంలో ఈ ఖరీఫ్‌ సీజన్‌కు కిలో విత్తనానికి రూ.10 చొప్పున రాయితీపై విత్తనాలు ఇవ్వడానికి రైతుల పేర్లు నమోదు చేసుకోవాలని అన్నారు. మండలంలో 27 రైతు భరోసా కేంద్రాల్లో ఈ ప్రక్రియ మొదలు పెట్టామని అన్నారు. ఈ నమోదు కోసం రైతులు ఆధార్‌ నంబరు తీసుకొని సంబంధిత రైతు భరోసా కేంద్రంలో గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించాలన్నారు. ఎకరానికి బస్తా 25, 30 కేజీ చొప్పున గరిష్టంగా రైతుకు 4 బస్తాలు ఇస్తామని అన్నారు. మండలంలోని 9 రకాల వరి విత్తనాలు 1507 క్వింటాళ్లు కేటాయించామన్నారు. గిరిజన గ్రామాల రైతుల కోసం 90 శాతం రాయితీపై మరో 420 క్వింటాళ్లు వరి విత్తనాలు ఉన్నాయని అన్నారు. పేర్లు నమోదు చేసుకున్న రైతులకు విత్తన సంస్థ ద్వారా రెండు రోజుల్లో విత్తనాలు అందజేస్తామని అన్నారు. విత్తనాలు తీసుకున్న తరువాత రైతులు తప్పనిసరిగా మొలక శాతం పరీక్ష చేసుకొని పొలంలో చల్లుకోవాలన్నారు. మొలక శాతం 80 శాతం కంటే తక్కువ వస్తే వెంటనే సంబంధిత రైతు భరోసా కేంద్రంలో తెలియజేయాలని సూచించారు.

 

➡️