మాట్లాడుతున్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
జిల్లాలోని హోటళ్లు, లాడ్జీలకు గ్రీన్ లీఫ్ రేటింగ్ ఇవ్వనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో హోటళ్లు, లాడ్జీల యాజమాన్యాలతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. హోటళ్లు, లాడ్జీలు, రెస్టారెంట్లలో పరిశుభ్రతను నిర్ధారించడం ద్వారా పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పరిచయం చేయబోతున్నామని చెప్పారు. గ్రీన్ లీఫ్ రేటింగ్ విధానాన్ని పలు విభాగాల్లో అమలు చేస్తామన్నారు. పర్యావరణ సమస్యలను దృష్టిలో ఉంచుకుని మెరుగైన పారిశుధ్య నిర్వహణను ప్రోత్సహించడానికి ఈ రేటింగ్ వ్యవస్థను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీని నియమిస్తున్నట్లు చెప్పారు. కలెక్టర్ అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ, జెడ్‌పి సిఇఒ, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సభ్యులుగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా పర్యాటక అధికారి సభ్య కార్యదర్శులుగా వ్యవహరిస్తారన్నారు. డివిజన్ స్థాయిలో హోటళ్లు, లాడ్జీలను తనిఖీ చేయడానికి ఉప కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. గ్రీన్ లీఫ్ రేటింగ్ సాధించడంలో సహకరించాలని యాజమాన్యాలకు సూచించారు. సమావేశంలో జెడ్పీ సిఇఒ శ్రీధర్‌రాజా, డిపిఒ భారతి సౌజన్య, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ ఎహసాన్ భాషా, పర్యాటక అధికారి ఎన్.నారాయణరావు, వాటర్ స్పోర్ట్స్ అసోసియేషన్, హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి మెట్ట నాగరాజు, జిల్లా కార్యదర్శి సతీష్ తదితరులు పాల్గొన్నారు.