ప్రకృతి వ్యవసాయంతో అధిక ఆదాయం

ప్రకృతి వ్యవసాయం

ప్రారంభిస్తున్న జెడి త్రినాథస్వామి

  • వ్యవసాయశాఖ జెడి త్రినాథస్వామి

ప్రజాశక్తి – లావేరు

ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల రైతులకు అధిక ఆదాయం, పోషక విలువలు కూడిన ఉత్పత్తి వస్తుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి త్రినాథస్వామి అన్నారు. మండలంలోని బెజ్జిపురంలో యూత్‌ క్లబ్‌ బెజ్జిపురం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యాన అమృత ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాన్ని నాబార్డు జిల్లా అభివృద్ధి మేనేజర్‌ రమేష్‌కృష్ణతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులందరూ ప్రకృతి వ్యవసాయం ద్వారా ఉత్పత్తులు అందించాలన్నారు. గ్రామసిరి, గోగు కిరణాలు రైతు ఉత్పత్తిదారుల కంపెనీలో సభ్యులుగా చేరేందుకు యూత్‌క్లబ్‌ తరహా అన్ని స్వచ్ఛంద సంస్థలూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల భూమి సారవంతం పెరిగి అధిక పంట దిగుబడికి ఉపయోగపడుతుందని తెలిపారు. మండల ఎఒ రమేష్‌ నాయుడు మాట్లాడుతూ రైతులు అధిక మొత్తంలో క్రిమిసంహారక మందులు వినియోగించడం వల్ల భూమి సారం కోల్పోతుందన్నారు. విషాహార ఉత్పత్తులు ప్రజలకు అందించి వారి అనారోగ్యానికి కారకులవుతున్నామని తెలిపారు. పురుగు మందుల వాడకం తగ్గించాలని సూచించారు. యూత్‌ క్లబ్‌ అధ్యక్షులు మేడూరి ప్రసాదరావు మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యాన రైతులకు ప్రకృతిసిద్ధమైన కషాయలు, ద్రావణాలు గ్రామాల్లో అవగాహనా కార్యక్రమాల ద్వారా రైతులకు తక్కువ లాభంతో అందిస్తున్నామన్నారు. ప్రకృతి వ్యవసాయం చేసిన రైతులు పండించిన ఉత్పత్తులు ఎక్కువ మొత్తం చెల్లించి తమ రైతు కంపెనీల ద్వారా కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి ఇజ్జాడ అప్పారావు, కోశాధికారి గంట్యాడ అప్పలనాయుడు, డిసిసిబి బ్రాంచ్‌ మేనేజర్‌ సిహెచ్‌.సృజన, సూపర్‌వైజర్‌ పోలినాయుడు పాల్గొన్నారు.

➡️