భారీగా టిక్కెట్ల రేట్ల పెంపు డిమాండ్‌ బట్టి ఛార్జీల వసూలు

సంక్రాంతి వేళ ప్రయివేటు బస్సులు టిక్కెట్ల ధరలను

– ఎ.విజరు కుమార్‌, జిల్లా ప్రజా రవాణా అధికారి

సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ఆర్‌టిసి ప్రత్యేక బస్సులు

సాధారణ ఛార్జీలతో ఊరట

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

సంక్రాంతి వేళ ప్రయివేటు బస్సులు టిక్కెట్ల ధరలను అమాంతం పెంచేశాయి. ఆర్‌టిసి ప్రత్యేక బస్సులు తిప్పుతున్నా డిమాండ్‌ దృష్ట్యా అవకాశాన్ని ప్రయివేట్‌ ట్రావెల్స్‌ సొమ్ము చేసుకుంటున్నాయి. అధిక ధరలతో ప్రయాణికులను దోచేస్తున్నాయి. పండగ దగ్గరకొచ్చేసరికి టిక్కెట్‌ ధరలను పెంచుతూ పోతున్నారు. సాధారణ రోజుల్లోనే ఆర్‌టిసి కంటే అదనపు రేట్లు ఉండే ప్రయివేట్‌ బస్సుల్లో సుమారు రెట్టింపు సొమ్ములు వసూలు చేస్తున్నారు. మూడు రోజుల పెద్ద పండగ కావడంతో చేసేది లేక వ్యయ ప్రయాసలకోర్చి జనం సొంతూళ్లకు వెళ్తున్నారు. మరోవైపు సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్‌టిసి ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ప్రయివేట్‌ ట్రావెల్స్‌ భారీగా ఛార్జీలను వసూలు చేస్తున్న నేపథ్యంలో ఆర్‌టిసి సాధారణ ఛార్జీలను వసూలు చేయడం ప్రయాణికులకు కొంత ఊరటనిస్తోంది.సంక్రాంతి పండగ కావడంతో శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) వైపు వచ్చే రైళ్లన్నీ నిండిపోయాయి. రిజర్వేషన్లు ఓపెన్‌ చేసిన కొద్దిరోజులకే నో మోర్‌ బుకింగ్‌ అంటూ ఆన్‌లైన్‌ డిస్‌ప్లేలో కనిపించింది. వెయిటింగ్‌ లిస్టు చాంతాడులా ఉంది. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు వరుసగా సెలవులు కావడంతో పదో తేదీ నుంచి ప్రయాణాలు మొదలుపెట్టారు. దీంతో 10, 11 తేదీల్లో చాంతాడులా వెయిటింగ్‌ లిస్టు ఉంది. పాఠశాలలు, కళాశాలలకు ఈనెల పదో తేదీ నుంచి 19వ తేదీ వరకు సెలవులు కావడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా దాదాపుగా 19వ తేదీనే తిరుగు ప్రయాణమయ్యే పరిస్థితి ఉండడంతో ఆ రోజూ రైళ్లకు విపరీతమైన డిమాండ్‌ నెలకొంది. రైళ్లు నిండిపోవడంతో ప్రత్యామ్నాయంగా అంతా ప్రైవేట్‌ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. దీన్నే ప్రయివేట్‌ ట్రావెల్స్‌ సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రయాణ రద్దీ, ఆయా తేదీలను బట్టి డబ్బులను వసూలు చేస్తున్నాయి. ఆ తేదీల్లో బస్సులు లేవంటూ రెండు సీట్లు సర్దుబాటు చేస్తామంటూ సాధారణ రోజుల కంటే రెండింతలు పెంచి దోపిడీ సాగిస్తున్నాయి. సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌శ్రీకాకుళం నగరంతో పాటు టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం, కొత్తూరు తదితర ప్రాంతాల నుంచి 13 బస్సుల వరకు ప్రయివేట్‌ ఆపరేటర్లు తిప్పుతున్నారు. ఇవి విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ మీదుగా హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు వెళ్తున్నాయి. ప్రధానంగా విజయవాడ, హైదరాబాద్‌ రూట్‌లోనే ఎక్కవగా నడపుతున్నారు. వీటితో పాటు నెల్లూరు రూట్‌లో తొమ్మిది ప్రయివేట్‌ ట్రావెల్స్‌ బస్సులు నడుస్తున్నాయి. చెన్నై, బెంగళూరు ప్రాంతాలకు ఒక్కో ప్రయివేట్‌ బస్సు తిరుగుతోంది. ఇందులో ఎసి, నాన్‌-ఎసి, స్లీపర్‌ సర్వీసులు ఉన్నాయి. సెలవులు, డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని అమాంతంగా ఛార్జీలను పెంచేశారు. ఉదాహరణకు హైదరాబాద్‌ నుంచి శ్రీకాకుళం వరకు అన్ని ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సులను రూ.3,200 పైన వసూలు చేస్తున్నాయి. అదే ఆర్‌టిసి బస్సు నాన్‌ ఎసి (సూపర్‌ లగ్జరీ) బస్సులో రూ.1400 ఛార్జీ మాత్రమే తీసుకుంటున్నారు. విజయవాడ నుంచి శ్రీకాకుళంకు అన్ని ప్రయివేట్‌ ట్రావెల్‌ బస్సులు రూ.1500 వరకు వసూలు చేస్తున్నాయి. ఆర్‌టిసి సూపర్‌ లగ్జరీలో రూ.860 మాత్రమే వసూలు చేస్తోంది. ప్రయివేట్‌ ఎసి బస్సుల్లో ఒక్కో టిక్కెట్‌కు రూ.రెండు వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆర్‌టిసిలో ఇంద్ర (ఎసి) బస్సుకు రూ.1100 మాత్రమే తీసుకుంటున్నారు. ఆర్‌టిసిలో రానూపోనూ రిజర్వేషన్‌ చేసుకుంటే టిక్కెట్‌లో పది శాతం రాయితీ కూడా ఇస్తోంది. పండగ వేళ ఆర్‌టిసి సాధారణ ఛార్జీలే వసూలు చేస్తుండడంతో ప్రయాణికులకు కొంత ఊరట కలుగుతోంది. సంక్రాంతికి ఆర్‌టిసి ప్రత్యేక బస్సులుసంక్రాంతి పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎపిఎస్‌ ఆర్‌టిసి ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చే వారి కోసం ఈనెల తొమ్మిది నుంచి 13వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. తిరుగు ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని పండగ తర్వాత 17 నుంచి 19వ తేదీ వరకు తిప్పనున్నారు. హైదరాబాద్‌కు పది నుంచి 13వ తేదీ వరకు ప్రత్యేకంగా 18 సూపర్‌ లగ్జరీ బస్సులను నడిపేలా ప్లాన్‌ చేశారు. గురువారం ఆరు బస్సులను హైదరాబాద్‌కు పంపారు. శ్రీకాకుళం నుంచి విజయవాడకు పది బస్సులు తిరుగుతుండగా, అదనంగా ఒక బస్సు నడుపుతున్నారు. రాజమండ్రి నుంచి శ్రీకాకుళానికి రెండు స్పెషల్‌ బస్సులు, టెక్కలి నుంచి అమలాపురానికి ప్రత్యేక బస్సు నడుపుతున్నారు. ఈనెల 10 నుంచి 13వ తేదీ వరకు అధిక రద్దీ ఉంటుందన్న అంచనాలతో విశాఖ నుంచి శ్రీకాకుళం రూట్‌లో 30 బస్సులు అదనంగా నడపనున్నారు. రద్దీని బట్టి పలాస, సోంపేట, పాతపట్నం ప్రాంతాలకు అదనంగా బస్సులు నడిపేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. రద్దీకనుగుణంగా ప్రత్యేక బస్సులుసంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని బస్సులను నడిపేలా ప్లాన్‌ చేశాం. ఏయే రూట్లలో అధిక రద్దీ ఉందో అందుకనుగుణంగా ప్రత్యేక బస్సులను సిద్ధం చేశాం. ఇప్పటికే హైదరాబాద్‌కు ఐదు బస్సులను పంపాం. ప్రయాణికుల అవసరాలను గుర్తించి అందుబాటులో ఉన్న స్పేర్‌ బస్సులను నడిపేందుకు సిద్ధంగా ఉన్నాం. విశాఖ కాంప్లెక్స్‌లో 24 గంటలూ పనిచేసేలా జిల్లా సిబ్బందితో ఒక టీమ్‌ను ఏర్పాటు చేశాం. రైళ్లు దిగే ప్రయాణికులను జిల్లాకు చేర్చేలా ప్రణాళికలు సిద్ధం చేశాం.

 

➡️